కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా విశాఖ ఏపీఎస్ ఆర్ టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడికి ఎక్కడికక్కడే జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. బస్టాండ్‌లు, గ్యారేజీలను ఎప్పటికప్పుడు దగ్గరుండి శుభ్రం చేయిస్తున్నారు. కరోనాపై ప్రయాణీకులకు అవగాహన కల్పిస్తున్నారు విశాఖ ఆర్టీసీ అధికారులు.

 

కరోనా వ్యాప్తిపై విశాఖ ఆర్టీసీ అధికారులు అలర్టయ్యారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆసియాలోనే ప్రధాన బస్టాండ్‌లలో విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు పేరుంది. ఇక్కడి నుంచి దాదాపు అన్ని ప్రధాన నగరాలకు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. లక్షల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు బస్సుల్లో ప్రయాణించే వారిపట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా వేసవి కాలంలో ఎక్కువగా ఏసీ బస్సులలోనే ప్రయాణం చేయడానికి పాసింజర్స్ ఇష్టపడుతుంటారు. ఐతే...కరోనా దెబ్బకు ఏసీ సర్వీసులు తగ్గిపోయాయి. ఉన్న కొద్దిపాటి సర్వీసుల్లో కూడా ప్రయాణం చేయడానికి జనం అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రయాణికులను పెంచుకునే మార్గాలను ఆలోచిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అవసరం అనుకుంటే డిపోల వద్ద వైద్య బృందాలను ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

 

ఇక...కరోనా వైరస్‌ను అరికట్టడానికి బస్టాండ్‌లు, గ్యారేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు 50కి పైగా ఏసీ బస్సులు, మరో 3 వందల వరకు లగ్జరీ, డీలక్స్‌, మెట్రో, సిటీ ఆర్డినరీ బస్సుల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని చల్లారు. బస్టాండ్ల సముదాయాల్లోని విశ్రాంతి గదులు, ప్రయాణీకులు నిరీక్షించే కుర్చీలపైనా ఈ ద్రావణాలను చల్లుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు విశాఖ ఆర్టీసీ అధికారులు.

 

మరోవైపు...ఏసీ బస్సుల్లో ఏసీని పెంచకుండా సాధారణ ఉష్ణోగ్రత ఉండేలా చూస్తున్నారు. చాలా బస్సుల్లో ప్రయాణికుల కోరిక మేరకు ఏసీలను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇంద్ర, అమరావతి, వెన్నెల బస్సుల్లో వినియోగించే దుప్పట్లు, ఇతర సామగ్రిని ఎప్పటికప్పుడు కొత్తవి మారుస్తున్నారు. 

 

ఇక...ఆర్టీసీ బస్సుల గ్యారేజీల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీ బస్సులోనూ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజారవాణా విభాగ వైద్యాధికారి పర్యవేక్షణలో ఒక్కో డిపోలో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులను బృందంగా నియమిస్తున్నారు. డ్రైవరు, కండక్టర్లు సహా ఇతర ఉద్యోగులంతా మాస్క్‌ ధరించాలని సూచిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

 

కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రయాణికులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు ఏసీ బస్సుల్లో, సాధారణ బస్సుల్లో ప్రయాణించేటపుడు మాస్కులు తప్పనిసరిగా ధరిస్తున్నారు. అధికారులు కూడా ప్రయాణికులకు మాస్క్‌లు-శానిటైజర్లు అందించి కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పాసింజర్స్ కోరుతున్నారు.

మొత్తానికి...కరోనా వైరస్‌ ప్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు చేపట్టిన చర్యలు ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తాయో చూడాల్సిందే మరి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: