కరోనా వైరస్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్య‌ప్తంగా ప్ర‌జ‌ల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా నుంచి తప్పించుకోవ‌డానికి ప్రతి ఒక్కరూ ప్ర‌య‌త్నిస్తున్నా.. ఎక్క‌డోక‌క్క‌డ క‌రోనా కేసులు బ‌య‌ట ప‌డుతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికీ మూడు వేల‌ మందికి పైగా మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ వైర‌స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాప్తిచెందుతుంది. దీంతో ఇప్ప‌టికే షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియోట‌ర్స్‌, స్పూల్స్‌ మూసి వేశారు. ఇక తాజాగా కేసీఆర్ కరోనాపై సమీక్షించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కీల‌క నిర్ణ‌యాలు వెల్ల‌డించారు. 

 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 కరోనా వైరస్ కేసులు నమోదయినట్లు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో కరోనావ్యాధితో ఎవరూ చనిపోలేదని.. కనీసం వెంటిలేటర్‌పైనా పెట్టలేదని స్పష్టం చేశారు. మ‌రియు తెలంగాణలో కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లందరూ బయటి దేశం నుంచి వచ్చిన వారేనని, ఇక్కడి వాళ్లకు ఎవరికి ఈ వైరస్ సోకలేదని, ఆందోళన చెందవద్దని అన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు గుమికూడకుండా ఉండాలని.. అదే కరోనాకు విరుగుడు మందన్నారు. ఈ క్ర‌మంలోనే కరోనా వైరస్ నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణలో జ‌రిగే పెళ్లిళ్లపై ఆంక్షలు విధించారు. 

 

పెళ్లిళ్లు రాత్రి 9 గంటల లోపు కంప్లీట్ చేయాలని సూచించారు. అవి కూడా పోలీసు శాఖ నియంత్రణలో జరగాలని.. మ‌రియు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవాలని కేసీఆర్ ఆంక్షలు విధించారు. అంతేకాకుండా..  31 తర్వాత జరిగే పెళ్లిళ్లను వాయిదా వేయాలని సూచించారు. ఇక ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లో భక్తులను అనుమతించవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 22న జరగబోయే జగ్‌నేకీ రాత్ ను రద్దు చేసినట్టు చెప్పారు. 25న ఉగాది రోజు పంచాంగ శ్రవణం లైవ్ టెలికాస్ట్ చేస్తామన్నారు. ఈ టెలికాస్ట్ ద్వారానే ప్రజలు తమ ఇళ్లల్లో వీక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. అలాగే, శ్రీరామనవమి ఉత్సవాలు కూడా రద్దు చేసినట్టు చెప్పారు. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: