ప్ర‌పంచ వ్యాప్తంగా పెను ప్ర‌మాదంగా మారిన క‌రోనా వైర‌స్ ఇప్పుడు క్ర‌మ‌క్ర‌మంగా మ‌న దేశంలో కూడా విస్త‌రిస్తోంది. ఇప్పటికే క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య మ‌న దేశంలో 160 క్రాస్ అయ్యింది. క‌రోనా వైర‌స్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 4కు చేరుకుంది. ఈ క్ర‌మంలోనే గురువారం రాత్రి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ఈ మ‌హ‌మ్మారిపై ఎలా యుద్ధం చేయాలి ?  ఎలా ఎదుర్కోవాలా ప్ర‌సంగం చేశారు. ఈ ప్ర‌సంగంలో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌పంచాన్ని కుదిపేస్తోన్న క‌రోనా వైర‌స్ భారత్‌ పై  ప్రభావం చూప‌డం లేదనుకోవడం తప్పు అని స్ప‌ష్టం చేశారు. ఇక ప్ర‌తి ఒక్క‌రు స‌మూహంలో ఉండ‌వ‌ద్ద‌ని.. స్వీయ నియంత్ర‌ణ అవ‌స‌ర‌మ‌ని మోదీ సూచించారు.


ఇక సీనియ‌ర్ సిటిజ‌న్లు ఇళ్లు దాటి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించిన మోదీ.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మిన‌హా ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని దేశ ప్ర‌జ‌ల‌కు సూచించారు. క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించ‌డంతో సామాజిక దూరం అనేది చాలా ముఖ్య‌మైంద‌ని.. ప్ర‌తి ఒక్క‌రు దీనిని పాటించాల‌ని మోదీ తెలిపారు. ఇక క‌రోనాపై యుద్ధం ప్ర‌క‌టించిన ఆయ‌న మార్చి 22న ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ (ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా పాటించే క‌ర్ఫ్యూ ) పాటించి ఆ త‌ర్వాత సాయంత్రం 5 సాయంత్రం గంటలకు అందరూ బైటికి వచ్చి 5 నిమిషాలు చప్పట్లు కొట్టి.. క‌రోనా రోగుల‌కు వైద్యం చేస్తోన్న వారికి కృత‌జ్ఞ‌త పాటించాల‌ని సూచించారు.


ఇక క‌రోనా విష‌యంలో ప్ర‌తి ఒక్క భార‌తీయుడు యుద్ధానికి సిద్ధం కావాల‌ని... నిత్యావ‌స‌రాలు.. మందులు.. ఇత‌ర అత్య‌వ‌స‌ర వ‌స్తువ‌ల కొర‌త రాద‌ని.. ఈ విష‌యంలో ప్ర‌జ‌లు ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని మోదీ చెప్పారు. ఇక కరోనా రోగుల‌కు త‌మ ఆరోగ్యాన్ని తెగించి మ‌రీ వైద్యం చేస్తోన్న
వైద్య, శానిటేషన్‌ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్ర‌తి ఒక్క‌రు కేంద్రం ప్రభుత్వం నిర్దేంచిన మార్గ దర్శకాలను పాటించాల‌ని చెప్పిన మోదీ.. గ‌తంలో తాను ఎప్పుడు పిలుపు ఇచ్చినా ప్ర‌జ‌లంద‌రూ ఎంతో స‌హ‌క‌రించార‌ని.. ఇప్పుడు కూడా అంతే స‌హ‌క‌రించి.. అంతే సంయమనాన్నే  పాటించాలి అని స్ప‌ష్టం చేశారు. ఏదేమైనా కరోనా మహమ్మారిపై  మానవజాతి తుది విజయం సాధించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: