దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు మరణదండన అమలు చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా వీరిలో ప్ర‌ధాన నిందితుడు అయిన రామ్‌సింగ్ తిహార్ జైలులోనే ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. మ‌రో మైన‌ర్ నిందితుడు జైలు శిక్ష త‌ర్వాత విడుద‌ల అయ్యారు. ఇక దోషులుగా తేలిన ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను తీహార్‌ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. జైలు అధికారుల సమక్షంలో మీరట్‌ నుంచి వచ్చిన తలారి పవన్‌.. మనీలా తాళ్లతో ఉరి తీశారు. 



క్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్‌ కేంద్ర కారాగారంలో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి. ఇక ఉరి శిక్ష త‌ప్పించేందుకు వీరి న్యాయ‌వాదులు చివ‌రి వ‌ర‌కు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. అవ‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి. ఇక నిర్భ‌య దోషుల‌కు ఎటువంటి చట్టపరమైన అవకాశాలు మిగిలిలేవని ఢిల్లీ కోర్టు గురువారం స్పష్టం చేయడంతో ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు చేశారు. దోషులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం ప్రకటించారు. తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని వ్యాఖ్యానించారు.


ఇక ఉరిశిక్ష అమ‌లుకు ముందు దోషుల్లో ఒక‌రు అయిన విన‌య్‌శ‌ర్మ భోరున విల‌పించారు. చేసిన పాపానికి ప‌శ్చాత్తాప ప‌డుతూ ఏడ్చేశాడు. ఇక ఉద‌యం ఉరి తీత‌కు ముందు 4 గంట‌ల‌కు న‌లుగురు దోషుల‌కు అల్పాహారం ఇచ్చారు. ఆ త‌ర్వాత ఒకే స‌మ‌యంలో న‌లుగురిని ఉరితీశారు. అల్పాహారం అనంత‌రం న‌లుగురికి  వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇక ఉరి తీత త‌ర్వాత అటు దోషుల కుటుంబాలు తీవ్ర విషాదంలో కూరుకుపోయాయి. అదే టైంలో నిర్భ‌య త‌ల్లి దండ్రుల‌తో పాటు బంధువులు, స్నేహితులు జైలు ముందు సంబ‌రాలు చేసుకున్నారు. ఏదేమైనా దేశ‌వ్యాప్తంగా 8 సంవ‌త్స‌రాలుగా వార్త‌ల్లో ఉన్న నిర్భ‌య క‌థ ఎట్ట‌కేల‌కు దోషుల ఉరితో కంచికి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: