ఎట్టకేలకు నిర్భయ కేసు దోషులకు శుక్రవారం ఉదయం ఉరితీశారు. ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ ఆత్మకు శాంతి చేకూరింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు ప్రధాన నిందితులు ఉన్నారు. వీరిలో ప్ర‌ధాన నిందితుడు రామ్ సింగ్ గతంలోనే తిహార్ జైలు గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మ‌రో మైన‌ర్ అయిన దోషి మూడు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం జునైల్ హోం నుంచి విడుదల అయ్యాడు. మిగిలిన నలుగురు దోషులకు ఈ రోజు ఉరిశిక్ష అమలు అయింది. ఇక వీరిని ఉరి తీసిన త‌లారి ప‌వ‌న్ జ‌ల్లాద్‌ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర‌ట్ జిల్లాకు చెందిన వ్య‌క్తి.



ప‌వ‌న్ జ‌ల్లాద్ తాత‌, ముత్తాత‌ల కాలం నుంచే ఉరి వేయ‌డంలో అనుభ‌వం సంపాదించారు. ఉరి శిక్ష అమ‌లులో ఆయ‌న ఎలాంటి పొర‌పాట్లు చేయ‌ర‌న్న పేరు తెచ్చుకున్నారు. ఉరి తీయ‌డంలో ఆయ‌న వృత్తి ప‌ర‌మైన నైపుణ్యం సంపాదించారు. అయితే సినిమాల్లో చూపిన విధంగా కాకుండా ఉరి శిక్ష అమ‌లు చేసే స‌మ‌యంలో ఉరి వేయ‌బోతోన్న వారికి ఎలాంటి బాధ లేకుండా ఆయ‌న వేస్తాడు. అయితే ప‌వ‌న్ ఈ వృత్తిలో ఎంత నైపుణ్యం సంపాదించినా ఆయ‌న‌కు మాత్రం అతి సామాన్య జీవితం అనుభ‌విస్తున్నారు.



ఆర్థికంగా కూడా ఆయ‌న కుటుంబం క‌ష్టాల్లో ఉంది. అయినా క్రూర‌మైన నేరం చేసే వారిని ఉరి వేసేందుకు త‌న‌కు ఈ అవ‌కాశం వ‌చ్చినందుకు ప‌వ‌న్ ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నాడు. ఇక ప‌వ‌న్ జ‌ల్లాద్ ఫ్యామిలీ ఇప్ప‌టికే మూడు , నాలుగు త‌రాల నుంచి ఈ వృత్తిలో ఉంది. ఇప్పుడు ఆయ‌న కుటుంబంలో ఈ వార‌స‌త్వం కంటిన్యూ చేసేందుకు ఆయ‌న చిన్న కుమారుడు కూడా ఉత్సాహం చూపిస్తున్నాడు. ఏదేమైనా దేశ వ్యాప్తంగా ఎంతో సంచ‌ల‌నం రేపిన నిర్భ‌య దోషులు న‌లుగురికి ఒకేసారి ఉరి వేసిన అరుదైన రికార్డు ప‌వ‌న్ జ‌ల్లాద్ సొంతం అయ్యింది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: