కరోనా బూచి తెలంగాణాను వణికించేస్తోంది. రోజు రోజుకుకు కరోనా వైరస్ బాగా పెరిగిపోతోంది. ఇప్పటికి రాష్ట్రం మొత్తం మీద 17 కేసులను గుర్తించిన వైద్యాధికారులు బాధితులను ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైరస్ మరింతమందికి సోకకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు దిగిందని సమాచారం. ఇందులో భాగంగానే రాష్ట్రం మొత్తం 144 సెక్షన్ విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

వైరస్ భూతంపై ఇప్పటికే స్వయంగా కేసియారే అనేకసార్లు ఉన్నతాధికారులతో రెగ్యులర్ గా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదే పద్దతిలో మీడియా సమావేశంలో కూడా మాట్లాడి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను కూడా వివరించారు. వైద్యాధికారులను మాత్రమే కాకుండా మొత్తం అధికారయంత్రాగాన్నంతా కరోనా వైరస్ కట్టడికే ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద వైరస్ ముదరకుండా కేసియార్ ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు బాగానే ఉన్నాయి.

 

గడచిన మూడు రోజులుగా హైదరాబాదే కాకుండా మొత్తం  తెలంగాణా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్ధలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పబ్ లు, బార్లు, పార్కులు, పబ్లిక్ ప్లేసులన్నింటినీ మూసేయించారు. ఎప్పుడైతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందో అప్పటి నుండే పబ్లిక్ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. అందుకనే ఎప్పుడూ రద్దీగా ఉండే చాలా ప్రాంతాలు ప్రస్తుతం బోసిపోయినట్లుంటున్నాయి. వైరస్ విజృంభిస్తే చికిత్సలు అందించేందుకు వీలుగా క్వారంటైన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

 

గచ్చిబౌలిలోని స్టేడియం, పోలీసు శిక్షణా కేంద్రంతో పాటు పెద్ద పెద్ద భవనాలు, కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్పేస్ ను కూడా ప్రభుత్వం క్వారంటన్ సెంటర్లుగా మార్చేసింది. రోగులకు చికిత్సలు అందించేందుకు వైద్యులను, వైద్య విద్యార్ధులతో పాటు నర్సులు, నర్సింగ్ స్టాఫ్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చుకున్నది. ఏదేమైనా ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలకు అదనంగా రాష్ట్రం మొత్తం 144 సెక్షన్ విధిస్తే ఎలాగుంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఈరోజే రేపో నిర్ణయం వచ్చేస్తుంది లేండి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: