దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటివరకూ 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో మూడు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైయస్సార్ పెన్షన్ కానుక పథకం అమలులో బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
గ్రామ, వార్డ్ వాలంటీర్లు లబ్ధిదారులకు పింఛన్లకు బయోమెట్రిక్ లేకుండానే పంపిణీ చేయాలని ప్రభుత్వం సూచించింది. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన తరువాత వారి నుంచి మాన్యువల్ గా సంతకాలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో మొన్నటివరకు ఒక కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదు కాగా నిన్న రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అధికారిక లెక్కల ప్రకారం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 209కు చేరింది. ఏపీలోని విశాఖ జిల్లాలో 65 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి ధ్రువీకరించడంతో పాటు ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరింది. నిన్న రాత్రి తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు ప్రకటన చేసింది. 
 
కరోనా వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం తిరుమల, సింహాచలం, ఒంటిమిట్ట, అన్నవరం ఆలయాల్లో దర్శనాలను నిలిపివేసింది. దేశంలో ఇప్పటివరకూ 20 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కరోనా భారీన పడి ఐదుగురు మృతి చెందగా 20 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: