రెండు నెలల క్రితం చైనాలో మొదలైన కోవిడ్-19(కరోనా వైరస్)...ఇప్పుడు ప్రపంచంలో దాదాపు అన్నిదేశాలని చుట్టేసింది. ఈ మహమ్మారి వల్ల వేల సంఖ్యలో మనషులు ప్రాణాలు గాలిలో కలిసిపోగా, లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మెడిసిన్ అందుబాటులో లేని ఈ వైరస్ భారతదేశంలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ భయంకర వైరస్ నాలుగు దశల్లో వ్యాప్తి చెందుతుంది.

 

అయితే ఆ నాలుగు దశలు ఏవి? ఏ దశలో వైరస్‌ని నియత్రించుకోవాలి? మన దేశంలో ఈ వైరస్ ఏ దశలో ఉందనే విషయాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ డీజీ డాక్టర్‌ బలరాం భార్గవ వివరించారు.

 

కరోనా వైరస్ మొదటి దశ...చైనా, ఇటలీ, ఇరాన్‌ తదితర దేశాలకు వెళ్లొచ్చిన వారికి మాత్రమే వైరస్‌ పాజిటివ్‌గా వస్తుంది. తొలి దశలో బయటపడ్డ కేసులన్నీ ఇలాంటివే.

 

రెండో దశ: విదేశాలకు వెళ్లి కరోనా బారిన పడి మనదేశానికి వచ్చినవారి కుటుంబసభ్యులు, సహోద్యోగులకు వైరస్‌ సోకే దశ ఇది. దేశంలో ప్రస్తుతం ఈ దశ నడుస్తోంది. ఈ దశను ‘లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌’గా వ్యవహరిస్తారు.

 

మూడో దశ: ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. రెండో దశలో వైరస్‌ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల వారికి వైరస్‌ పెద్దఎత్తున వ్యాపిస్తుంది. ఈ దశలోనే వేలాది మందికి వైరస్ సోకుతుంది.

 

నాలుగో దశ:  ఇక ఇది మనిషి మరణాన్ని శాసించే దశ. ఈ వైరస్‌కు ముగింపు ఎక్కడ ఉంటుందో అర్ధంకాని పరిస్థితి ఉంటుంది. ఈ దశలో వైరస్‌ నియంత్రణ చెయ్యి దాటిపోతుంది. ఇప్పుడు ఇటలీ, ఇరాన్‌ ఈ దశలోనే ఉన్నాయి. ఆ రెండు దేశాలు ఆలస్యంగా  మేలుకోవడం వల్ల వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి.

 

కాగా, మనదేశంలో కరోనా వ్యాప్తి ఇప్పుడు రెండో దశలో ఉంది. వైరస్‌ వ్యాప్తి మూడో దశలోకి ప్రవేశించడాన్ని ఆపడానికి భారతదేశానికి ఉన్న గడువు కేవలం 30 రోజులే. అందుకనే భారత ప్రభుత్వం ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది. అన్నీ వ్యవస్థలని స్తంభింపజేసింది. అలాగే ప్రధాన మోడీ ఈ వైరస్ చైన్ బ్రేక్ చేయడానికి జనతా కర్ఫ్యూ పెట్టారు. మొత్తానికైతే ఈ మహమ్మారిని మనదేశంలో రెండోదశలోనే ఆపేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: