తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 18కు చేరింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఒకేరోజు ఎనిమిది మందికి పాజిటివ్ అని రావడంతో కరోనాను అరికట్టేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. నిన్న రాష్ట్రంలో కేసీఆర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 
 
తాజాగా సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ప్రగతిభవన్ లో సీఎం మంత్రి ఈటల రాజేందర్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో కరోనా నిరోధానికి కరీంనగర్ లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు. రేపు కరీంనగర్ లో కేసీఆర్ పర్యటించనున్నారు. అధికారులు కరోనా వ్యాప్తి నిరోధానికి చేపడుతున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. 
 
ఇప్పటికే కరీంనగర్ లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇండోనేషియా నుండి కరీంనగర్ కు వచ్చిన వారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 30 మంది కరీంనగర్ నుంచి ఇండోనేషియాకు వచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ అధికారుల ద్వారా చికిత్స పొందుతున్న వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని, రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. 
 
అధికార యంత్రాంగం కరీంనగర్ లో వ్యాధి సోకకుండా పలు చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఈరోజే కరీంనగర్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నా మోదీతో వీడియో కాన్ఫరెన్స్ ఉండటంతో పర్యటన రేపటికి వాయిదా పడింది. ఈ పర్యటనలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. కరీంనగర్ లో కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.                    

మరింత సమాచారం తెలుసుకోండి: