ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో సాహ‌సోపేత నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో, ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించ‌డంలో ముందు వ‌రుస‌లో ఉంటారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ తెలంగాణ‌ను కూడా ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఇప్ప‌టికే ప‌లు పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన సీఎం కేసీఆర్ క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. వెంట‌నే విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు సాంకేతికంగా చ‌ర్య‌లు తీసుకుంటూనే ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే నేడు ప్ర‌భుత్వ ఉద్యోగులంద‌రూ క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. నిరంత‌ర కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. 

 

ఒక‌వైపు కరోనా వైరస్ బారిన ప‌డిన వారికి నాణ్య‌మైన వైద్య‌సేవ‌లు అందిస్తూనే మ‌రోవైపు వైర‌స్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కరీనంగర్ పట్టణంలో ఆయ‌న‌ పర్యటించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వీరిలో ఏడుగురికి వైర‌స్ సోకింది. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన‌ అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. ముఖ్యమంత్రి కూడా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచనలు చేస్తూ వ‌స్తున్నారు. అంతేగాకుండా.. స్వ‌యంగా ప‌రిశీలించేందుకు ఆయ‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం సాహ‌సోత‌మైన నిర్ణ‌య‌మేన‌ని ప‌లువురు అంటున్నారు. 

 

ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి తప్ప, స్థానికులెవరికీ వ్యాధి సోకకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి.  నిజానికి.. కరీంనగర్ లో పరిస్థితిని స్వయంగా పరిశీలించి, పర్యవేక్షించేందుకు శుక్రవారమే ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనరగ్ లో పర్యటించాలని భావించారు. కానీ శుక్రవారం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో ఈ పర్యటన శనివారానికి వాయిదా పడింది. ముఖ్య‌మంత్రితోపాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా కరీంనగర్ లో పర్యటిస్తారు. అక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారు. ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిలో ప‌లువురికి నాణ్య‌మైన వైద్య‌సేవ‌లు అందించి, వైర‌స్ బారి నుంచి వైద్యులు కాపాడారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: