ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి మోదీ చర్చించారు. మోదీ మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బెంగాల్ సీఎంలతో మాట్లాడారు. ఈ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారని సమాచారం. మోదీ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై, వైరస్ నివారణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. 
 
దేశవ్యాప్తంగా కరోనా గురించి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. నిన్న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈరోజు జరిగిన సమావేశంలో మోదీ ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా విజృంభిస్తోందని అన్నారు. మార్చి 1వ తేదీన అమెరికాలో 75 కరోనా పాజిటివ్ నమోదయ్యాయని నేడు ఆ సంఖ్య 14 వేలకు చేరిందని అన్నారు. 
 
ఎండ తీవ్రతకు కరోనా వ్యాపించదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ సౌదీలో కరోనా వేగంగా వ్యాపిస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎండ తీవ్రతకు కరోనా వ్యాపించదనడంపై ఆలోచించాల్సి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి కేసీఆర్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఏపీ నుంచి సీఎం జగన్, ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని పాల్గొన్నారు. 
 
దేశంలో ఇప్పటివరకూ 217 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 3 కేసులు నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాపించకుండా పలు చర్యలు చేపట్టాయి. కరోనా కట్టడి ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లు, థియేటర్లు, మాల్స్ మూసివేయాలని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్త వహిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన 14 రోజుల వరకు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: