ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు, ఇళ్ల పట్టాల పంపిణీ గురించి కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ కరోనా గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. ప్రజల్లో కరోనా గురించి నెలకొన్న అపోహలను తొలగించాలని చెప్పారు. ప్రజలు కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. 
 
ఎవరైనా కరోనా గురించి తప్పుడు సమాచారం ఇస్తే అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు రాష్ట్రంలో దుకాణాలన్నీ అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలోను రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కొరత వచ్చే అవకాశమే లేదని చెప్పారు. ఎవరైనా కరోనా పేరు చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అమ్మితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 
గ్రామ సచివాలయాల ద్వారా నిత్యావసర వస్తువుల ధరలపై దృష్టి పెట్టాలని.. అధికారులు నిరంతరం వస్తువుల ధరలను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. మాస్క్‌లను ఉపయోగించేవారు సరైన పద్ధతిలో పారవేయాలని సీఎం సూచించారు. మాస్క్‌లు ఎక్కడబడితే అక్కడ పారవేసినా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు. వైద్యులు తప్పనిసరిగా మాస్క్‌లు ఉపయోగించాలని చెప్పారు. 
 
65 సంవత్సరాల వయస్సు పై బడిన వారిపై కరోనా ఎక్కువగా ప్రభావం చూపుతుందని అన్నారు. షుగర్, కిడ్నీ వ్యాధులతో బాధ పడే వారిపై ఈ వైరస్ మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు మాత్రమే రాష్ట్రంలో కరోనా భారీన పడ్డారని చెప్పారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న కలెక్టర్లు, అధికారులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, వాలంటీర్లను జగన్ ప్రశంసించారు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: