కరోనా ప్రభావంతో సిక్కోలులో జీడిపరిశ్రమ తెల్లబోతోంది. గడచిన నెల రోజులుగా ఎగుమతులు నిలిచిపోవడంతో పరిశ్రమలు దివాళా తీసేందుకు సిద్ధంగా ఉన్నాయి. దశాబ్ధాలుగా వేలాదిమందికి జీవనోపాధినిస్తున్న ఆ ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. 

 

జీడిపప్పు ...ఈ పేరు వింటే చాలు ఏపీలో ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీకాకుళం జిల్లాలోని పలాస ప్రాంతమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దేశవ్యాప్తంగా జీడిపప్పుకు ఎనలేని గిరాకీ ఉంది. కానీ ఇది గతం. గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇక్కడి జీడి పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసింది. 

 

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధాన ప్రాంతం పరిధిలో సుమారు 300 వరకూ చిన్నా , పెద్ద జీడిపప్పు పరిశ్రమలున్నాయి. ఇక్కడ పండే జీడిపంటను ఆధారంగా చేసుకునే ఈ పరిశ్రమలన్నీ నడుస్తున్నాయి. దీంతో ప్రత్యక్షంగా...పరోక్షంగా దాదాపు 30 వేల కుటుంబాలకు ఈ కాజు ఇండస్ట్రీతో అనుబంధం ఉంది.  

 

జీడిపప్పు రవాణా, ఇతర కార్యకలాపాలతో మరో 1500 కోట్లు లావాదేవీలు సాగుతున్నాయి. పలాస పరిధిలోని ఈ జీడిపరిశ్రమల నుంచి నిత్యం 100 నుంచి 150 టన్నుల జీడిపప్పు విదేశాలకు ఎగుమతి అవుతుంది . అధికభాగం ఎగుమతులన్నీ మంగుళూరు కేంద్రంగా సాగుతుంటాయి. అక్కడి నుంచి ఇతర దేశాలకు ముఖ్యంగా చైనా, వియాత్నం, ఇతర యూరోపియన్ దేశాలన్నింటికీ ఎక్స్ పోర్ట్ అవుతుంది. అయితే  చైనాలో మొదలైన కరోనా వైరస్ ... ప్రపంచ దేశాలన్నింటిలోనూ విస్తరించడంతో ఆ ప్రభావం పలాస జీడి ఎగుమతుల పై పడింది. కరోనా విజృంభణ తర్వాత ఎగుమతులు పూర్తిగా నిలిపివేశారు. దేశ, విదేశాలకు మధ్య సరిహద్దులు మూసేయడంతో సరుకురవాణా నిలిచిపోయింది. 

 

మనదేశంలో కూడా కరోనా విజృంభిస్తుండటంతో దేశీయంగా కూడా జీడిపప్పును కొనే నాథుడు కరువయ్యాడు. దీంతో ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసిన జీడిపప్పును ఏం చేసుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారు  జీడిపరిశ్రమ యజమానులు. 

 

కరోనా దెబ్బకు ఎగుమతులు బాగా మందగించడంతో పలాస పరిశ్రమ మరోసారి సంక్షోభంలో పడింది. రోజుకు 100 నుంచి 150 టన్నుల జీడిపప్పు ఎక్స్ పోర్టు అయ్యే పరిస్థితుల నుంచి రోజుకు 20 టన్నులు కూడా ఎగుమతి అవ్వని స్థితి నెలకొంది. గత ఐదేళ్లుగా జీడిపరిశ్రమ పై దెబ్బమీద దెబ్బ పడుతోంది. హుద్ హుద్ తుఫాన్, ఆ తర్వాత తిత్లీ తుఫాన్, జీఎస్టీ ఇలా ఏటా ఏదో ఒక ఉపద్రవం క్యాష్యూ ఇండస్ట్రీని కుదేలయ్యేలా చేస్తోంది. గడచిన నాలుగు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, కరోనా విజృంభణతో మరింత గడ్డు పరిస్థితులు తయారయ్యాయి . ఎగుమతులు బాగా పడిపోవడంతో పలాస పరిధిలోని జీడిపరిశ్రమల్లో 75 శాతం మూత పడేందుకు సిద్ధంగా ఉన్నాయి .ఈక్రమంలో తమను ప్రభుత్వాలు ఆదుకోవాలని పరిశ్రమల యజమానులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: