ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుండటంతో విశాఖపట్టణం పోర్టు ట్రస్టు హైఅలర్ట్ ప్రకటించింది. చైనా సహా విదేశీ వాణిజ్య నౌకలకు క్వారంటైన్ గడువు విధించింది. ఓడల్లోని సిబ్బంది విశాఖ నగరంలోకి ప్రవేశంపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇప్పటి వరకూ 12 వందల 70 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా...వీరందరికీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.

 

భారతదేశ తూర్పుతీర వాణిజ్యంలో విశాఖపట్టణానిది ప్రత్యేక స్ధానం. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో రెండు మేజర్ పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. విశాఖపట్టణం పోర్టు ట్రస్టు, గంగవరం పోర్టుల ద్వారా ఏటా వేల కోట్ల రూపాయల కార్గో హ్యాండ్లింగ్ జరుగుతోంది. నౌకా వాణిజ్యానికి అత్యంత కీలకం విశాఖ తీరం.ఇక్కడికి...వివిధ దేశాల నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే...ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ...భారతదేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇక్కడి ఓడరేవులపైనా పడింది. దీంతో అప్రమత్తమైన విశాఖపట్టణం పోర్టు ట్రస్టు హై అలర్ట్ ప్రకటించింది. యుద్ధ ప్రాతిపదికన కరోనా నియంత్రణ చర్యలను ప్రారంభించింది. 

 

ఇక...కరోనా విజృంభణ మొదలైన తర్వాత 59 విదేశీ నౌకలు ఇక్కడికి వచ్చాయి. వీటిలో చైనా, ఇరాన్ దేశాలకు చెందినవి కొన్ని ఉన్నాయి. కరోనా ప్రభావిత దేశాల మీదుగా ప్రయాణించినవి మరికొన్ని ఉన్నాయి. చైనా నౌకలు విశాఖ వాసుల్లో అనుమానాలకు, గందరగోళానికి కారణమవుతున్నా యి. దీంతో వీపీటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మనుషులకు మాదిరిగానే ఓడలకు క్వారంటైన్ సమయం ప్రకటించింది. ఏ నౌక వచ్చినా విశాఖ పోర్టుకు పది నాటికల్ మైళ్ళ దూరంలోనే నిలిపివేస్తున్నారు. కనిష్టంగా 14 రోజులు పర్యవేక్షణ ఉండాలనే నిబంధన అమలు చేస్తోంది. పోర్టు వైద్య బృందం ఓడలోని సిబ్బందికి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తుంది. డాక్టర్స్ టీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే నౌకలు బెర్త్ పైకి వచ్చేందుకు అనుమతి లభిస్తోంది.

 

ఇక...కరోనా ప్రభావం అధికంగా ఉన్న 10 దేశాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాటినీ యాంకరేజ్‌లో నిలిపి ఉంచుతున్నారు. ఇప్పటి వరకూ విశాఖకు వచ్చిన 59 షిప్పులను తనిఖీలు నిర్వహించారు. 12 వందల 70 మంది సిబ్బందికి స్క్రీనింగ్ చేపట్టగా...వారందరికీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. పోర్ట్ హ్యాండ్లింగ్ ఉద్యోగులకు ప్రత్యేకమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పరిశుభ్రతతో పాటు కరోనా వ్యాప్తిని నిలువరించడానికి తీసుకోవాల్సిన  చర్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం నిర్దేశిస్తోంది.
మొత్తానికి...కరోనా కట్టడికి విశాఖ పోర్టు ట్రస్టు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: