ఎన్నో ఏళ్ల నుంచి శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీలో కింజరాపు ఫ్యామిలీ ఆధిపత్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు దివంగత ఎర్రన్నాయుడు జిల్లాకు పెద్ద దిక్కుగా ఉంటే, ఇప్పుడు ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు, సోదరుడు అచ్చెన్నాయుడులు లీడ్ చేస్తున్నారు. జిల్లా అధ్యక్షురాలుగా గౌతు శిరీష ఉన్నా, జిల్లాలో వీరి పెత్తనమే ఉంటుంది. టీడీపీ పార్టీలో ఏం జరిగినా, వీరి కనుసన్నల్లోనే జరుగుతుంది.

 

అయితే టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి అచ్చెన్నాయుడు కొంచెం రాష్ట్ర రాజకీయాలపై దృష్టిపెట్టారు. ఎల్లప్పుడు చంద్రబాబుకు అండగా ఉంటూ వస్తున్నారు. ఎక్కువ శాతం జిల్లాలో కంటే బాబుతో పాటు అమరావతిలోనే ఉంటున్నారు. ఇక ఇదే సమయంలో శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు జిల్లాపై పట్టు తెచ్చుకున్నట్లు కనబడుతుంది. తన తండ్రి మాదిరిగానే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రామ్మోహన్‌కు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై అవగాహన ఉంది. ముఖ్యంగా ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలపై.

 

శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలపై రామ్మోహన్‌కు పట్టు ఉంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో రామ్మోహన్‌కు ఫాలోవర్స్ ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో, ఆయా నియోజకవర్గాల్లో టీడీపీకి మెజారిటీ స్థానాలు దక్కేలా చేయడానికి కష్టపడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో కలిసి తిరుగుతూ... పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

 

ఇక రామ్మోహన్ ఈ విధంగా ముందుకెళ్లడం ద్వారా జిల్లాపై అచ్చెన్నకు పట్టు తగ్గినట్లు కనిపిస్తోంది. ఆయన కేవలం తన నియోజకవర్గం టెక్కలిపైనే ఫోకస్ చేస్తున్నారు. ఇక నియోజకవర్గంలో పనులు చేసుకుంటూనే, చంద్రబాబుకు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నిదానంగా శ్రీకాకుళం జిల్లా రామ్మోహన్ గ్రిప్‌లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే రామ్మోహన్ భవిష్యత్‌లో జిల్లా రాజకీయాల్లో పూర్తి స్థాయిలో చక్రం తిప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: