కరోనా.. ఇప్పుడు ఈ పేరు చెబితే అందరూ హడలి పోతున్నారు. దీన్నే అలుసుగా చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. అమాయక రైతులను మోసగిస్తున్నారు. కరోనా పేరు చెప్పి మొక్కజొన్న రైతులను వ్యాపారులు మోసం చేస్తున్నారు. ధరలు విపరీతంగా తగ్గిస్తూ వారు లాభాలు గడిస్తున్నారు. రైతుల పొట్ట కొడుతున్నారు.

 

 

అలాంటి మోసగాళ్లను ఉపేక్షించబోమని జగన్ సర్కారు చెబుతోంది. కరోనా సాకుతో రైతుల్ని మోసం చేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దళారులను హెచ్చరించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏప్రిల్‌ ఒకటి నాటికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మే నాటికి రాష్ట్రంలో 8 వేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చురుగ్గా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

 

 

కరోనా కారణంగా మార్కెట్లు మూత వేస్తున్నారని దళారులు ప్రచారం చేస్తున్నారు. ఈ పేరుతో రైతుల వద్ద నున్న సరుకును చౌకగా కొట్టేస్తున్నారు. అయితే మార్కెట్లు మూత వేయడం లేదని రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. రైతులు దళారుల మాటలు నమ్మొద్దన్నారు.

 

 

కరోనా వైరస్‌ కారణంగా మొక్కజొన్న, జొన్న ధరలు తగ్గుతున్నాయని తెలిసింది. మొన్ననే సీఎం వైయస్‌ జగన్‌ ధరల తగ్గుదలపై సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ వారం రోజులు గోడౌన్లు ఏర్పాటు చేసుకుంటాం. అరటికి రూ.800 గిట్టుబాటు ధర కల్పించామని భరోసా ఇచ్చారు.

 

 

కరోనా వల్ల ఇబ్బందులు వస్తాయన్న ఆందోళన ఉన్నప్పుడు దాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులతో చర్చించిన తరువాత రైతుల దృష్టికి కొన్ని విషయాలు రైతులకు తెలియజేస్తున్నాం. కొన్ని ఉత్పత్తులు కోతకు అవకాశం ఉంటే వారం, పది రోజులు ఆలస్యం చేయండని సూచించారు మంత్రి కన్నబాబు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: