అవును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఇద్దరూ మోడీకి జై కొడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు ఈ నెల 22న తలపెట్టిన జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. జనతా కర్ఫ్యూ విజయవంతానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లు, నోడల్‌ ఆఫీసర్లతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 

 

కరోనా వ్యాప్తి అరికట్టేందుకు జిల్లా స్థాయిలో అన్ని చర్యలకు సీఎం వైయస్‌ జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్ల నాని వివరించారు. 119 నమూనాలు పరీక్ష చేస్తే 108 కేసులు నెగిటివ్‌, 17 కేసులకు ఇంకా రిపోర్టు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో కొత్త ల్యాబ్స్‌ అవసరమని ప్రధానికి చెప్పినట్లు తెలిపారు. అంతర్జాతీయ విమానాలు ఎక్కువ కాలం బ్యాన్‌ చేయాలని కోరినట్లు చెప్పారు.

 

 

మరోవైపు అటు కేసీఆర్ సర్కారు కూడా జనతా కర్ఫ్యూ విజయంతానికి కృషి చేస్తామని ప్రకటించింది. 22 వ తేదీ ఆదివారం ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రజలంతా చప్పట్లతో సంఘీ భావం ప్రకటించాలని కూడా సూచించారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో మోడీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.

 

 

ఈ రెండు రాష్ట్రాల్లో తెలంగాణ పరిస్థితి కాస్త ఆందోళన కరంగానే ఉంది. హైదరాబాద్ తో పాటు కరీంనగర్ జిల్లాలోనూ కరోనా వ్యాపిస్తున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన విదేశీయులు ఎక్కడెక్కడ తిరిగారన్న అంశాలపై సమాచారం సేకరిస్తూ వైరస్ మరింతగా వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ పరిస్థితి కాస్త బెటర్ గానే ఉందని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: