రాష్ట్రంలో ఉన్న వేలాది మద్యం దుకాణాలు కరోనా వైరస్ పరిధిలోకి రావా ? అన్నదే ఇపుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.   దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ స్ధాయిలో అందరినీ వణికించేస్తోందో అందరూ చూస్తున్నదే. రాష్ట్రాలకు రాష్ట్రాలే వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వైరస్ స్ప్రెడ్ కాకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాయి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే రంగంలోకి దిగి ఆదివారం జనతా కర్ఫ్యూని పాటించాలంటూ పిలుపిచ్చేసిన విషయం అందరూ చూసిందే.

 

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే  తెలుగు రాష్ట్రాల్లో యధేచ్చగా తెరిచిఉంటున్న షాపుల్లో మద్యం దుకాణాలను ప్రముఖంగా చెప్పుకోవాలి. తెలంగాణా, ఏపి అని కాకుండా రెండు రాష్ట్రాల్లోను వేలాది మద్యం దుకాణాలు మాత్రం బ్రహ్మండంగా వ్యాపారాన్ని చేసుకుంటున్నాయి. సరే తెలంగాణాలో అయితే మొత్తం ప్రైవేటు వ్యవహారమే కాబట్టి వేలంపాటలో షాపులను పాడుకున్న వాళ్ళే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. కానీ ఏపిలో అలాకాదు.

 

ఏపిలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపిస్తోంది. ప్రతి షాపులోను నలుగురు ఉద్యోగులను నియమించి మద్యం అమ్మిస్తోంది. ఈ మద్యం కొనుక్కునేందుకు జనాలు ప్రతీ షాపు దగ్గర విపరీతంగా ఎగబడుతున్నారు. పైగా మద్యం అమ్మకాలపై ప్రభుత్వం టైమింగ్స్ కూడా గట్టిగా పటిస్తుండటంతో మందుబాబులో ఉదయం నుండే క్యూలు కడుతున్నారు. మరి ఈ సమయంలో కరోనా వైరస్ మందుబాబుల్లో ఎవరికైనా ఉంటే మిగిలిన వాళ్ళకు సోకే ప్రమాదం ఉంది కదా ?

 

కాబట్టి కరోనా వైరస్ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ ప్రభుత్వం మద్యం దుకాణాలను కూడా మూసేస్తే మంచిది కదా అని మద్యం దుకుణాల్లో పనిచేసే వాళ్ళే అనుకుంటున్నారట. ఎందుకంటే దుకాణాలకు ఎవరు వచ్చినా రాకపోయినా అమ్మే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా రావాల్సిందే. ఒకవైపేమో ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళకు కనీసం మీటర్ దూరంలో ఉండమని ప్రతి ఒక్కరికీ చెబుతోంది. కానీ మద్యం దుకాణాల దగ్గర ఆ నియమం పాటించటం కష్టం. మద్యం ఎక్కడ అయిపోతుందో అన్న ఆతృతలో ఎవరికి వారుగా కౌంటర్ల దగ్గర ఎగబడుతున్నారు. ఇందులో భాగంగానే గుంపులు గుంపులుగా కనబడుతున్నారు. కాబట్టి అసలు కొద్ది రోజులు షాపులనే మూసేస్తె సరిపోతుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: