ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే 169 దేశాలకు విస్తరించింది వైరస్. రెండున్నర లక్షల మంది దీని బారిన పడగా... దాదాపు 80 వేల మంది పూర్తిగా కోలుకున్నారు. ఇండియాలో వైరస్ సోకినట్లు నిర్థరణ అయిన వారి సంఖ్య 223 కు పెరిగింది. వీరిలో 22 మంది చికిత్స తీసుకుని పూర్తి ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి ఇంటికి చేరగా...నలుగురు చనిపోయారు. ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 49 మంది కరోనావైరస్ బాధితులు ఉన్నట్లు గుర్తించారు.

 

 

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా నెమ్మదిగా విస్తరిస్తోంది. ఏపీలో 1006 మంది అనుమానితులను గుర్తించగా...వీరిలో 259 మందిని క్వారంటైన్ లో ఉంచారు. 711 మందికి ఇంటి దగ్గర ఉండాలని అదికారులు ఆదేశించగా..36 మంది ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో శుక్రవారం మరో ముగ్గురికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్థారించారు వైద్యులు. వీటితో కలిసి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19 కి చేరింది. వీరిలో ఒకరు లండన్ నుంచి తిరిగి వచ్చిన మహిళ కాగా... ఇద్దరు దిల్లీ మీదుగా కరీంనగర్ వచ్చిన ఇండొనేషియా బృందంలోని సభ్యులు.

 

 

హైదరాబాద్‌లోని సీసీఎంబీని కరోనావైరస్ నిర్థరణ పరీక్షలకు ఉపయోగించుకునేందుకు అనుమతించాలని ప్రధానిని కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్. శుక్రవారం ప్రధానమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని సూచనలు చేశారు. 

 

 

మరోవైపు కేరళాను కరోనా కుదిపేస్తోంది. శుక్రవారం మరో 12 మందికి వైరస్ సోకినట్టు నిర్థారించారు అక్కడి వైద్యాధికారులు. ఎర్నకులంలో 5, కాసరగోడ్ లో 6, పాలక్కడ్ లో ఒకరికి కోవిడ్-19 పాజిటీవ్ ఉన్నట్టు గుర్తించారు. వీరితో కలిసి కేరళలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 40కి చేరింది. అటు చండీఘడ్ లోనూ ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా...మిగితా ముగ్గురిని స్థానికులుగా గుర్తించారు అధికారులు. హర్యానాలో ఐదుగురికి, పంజాబ్ లో ముగ్గురికి వైరస్ సోకినట్టు నిర్థారించాయి అక్కడి ప్రభుత్వాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: