అవును.. ఈ ఆటో డ్రైవర్‌ నిర్వాకం తెలిస్తే, మీరు ఖచ్చితంగా నోటిమీద వేలేసుకుంటారు. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటన, స్థానికులను భయ భ్రాంతులకు గురిచేసింది. తన ఆటో ఎక్కిన వ్యక్తినే డ్రైవర్ టార్గెట్ గా చేసుకొని, అతగాడి వద్ద భారీగా సొమ్ము కాజేశాడు. సదరు ఆటో డ్రైవర్‌ను 'పెంట్య ముదావత్‌'గా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతణ్ని పోలీసులు అరెస్టు చేసి, కటకటాల వెనక్కి నెట్టారు.

 

నేరేడ్‌మెట్ సమీపంలో ఉన్న కాకతీయ నగర్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు లక్డీకపూల్ నుంచి, కాకతీయ నగర్‌కు వెళ్లేందుకు ఓ ఆటో బుక్ చేసుకున్నారు. ఆటో ఇంటికి చేరుకున్నాక, ప్రయాణికులు లగేజీని కిందికి దింపుతుండగా లోపల ఉన్న ఒక హాండ్ బ్యాగ్‌తో ఆటో డ్రైవర్ ముదావత్ పెంట్య హుటా హుటిన  పరారయ్యాడు. దీంతో సదరు ప్యాసింజర్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సదరు డ్రైవర్ ను పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలించక, వారు వెంటనే సమీపంలో వున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

నెరేడ్ మెట్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టి.. శనివారం ఆటో డ్రైవర్‌ పెంట్య ముదావత్‌ను అరెస్టు చేశారు. ఇక పొతే.. అతగాడు దొంగతనం చేయడానికి గల కారణం వింటే ఒకింత ఆశ్చర్యం కలగక మానదు. తన ఆర్థిక పరిస్థితులు బాగా లేకనే దొంగతనానికి పాల్పడ్డట్లుగా నిందితుడు తెలిపాడు. ఇక అతడినుండి నుంచి 10 తులాల 8 గ్రాముల బంగారు నగలు, రూ.9 వేల నగదు, ఒక ఖరీదైన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

 

దొరికిన నగదు, బంగారాన్ని పోలీసులు బాధితులకు అందజేస్తూ... ఆటో ఎక్కి దిగాక, తమ వస్తువులను జాగ్రత్తగా సరిచూసుకోవాలని, ఇక దగ్గర, దూర ప్రాంతాలకు ఆటోలకు బదులు బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, అత్యంత విలువైన వస్తువులున్న బేగులను తమవద్దే ఉంచుకోవాలని సూచించారు. సదరు బాధితులు, నిందితున్ని పట్టుకుని, తమ వస్తువులను అప్పగించిన పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: