కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నల్గొండ జిల్లాలో కరోనా విస్తరించకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లాకు వస్తున్న విదేశీయులపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. విదేశాల నుంచి జిల్లాకు వస్తున్న వారికి ఇళ్లలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న వారితోనే కరోనా వైరస్ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. అయితే ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కరోనాపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో  జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు, వైద్యాధికారులతో సంయుక్తంగా అవగాహన కల్పిస్తున్నారు.

 

ఇక...నల్గొండ జిల్లాకు విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తిస్తున్నారు అధికారులు. వారి ఇళ్లకు వెళ్లి జిల్లా వైద్య అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 60 మందికి పైగా వైద్య పరీక్షలు చేశారు. వారికి కరోనా లేదని తేలింది. అయినప్పటికీ వారందరినీ హౌస్ ఐసోలేషన్‌లోనే ఉంచేశారు. వియత్నాం బృందం గత పది రోజుల క్రితం నల్గొండకు వచ్చింది. వీరంతా స్థానిక జైల్ ఖానా సమీపంలోని ఓ ప్రార్ధన మందిరంలోనే ఉన్నారు. పోలీసులు, వైద్య అధికారులు 12 మంది పెద్దలు, ఇద్దరు చిన్నారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని  వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు.

 

వియత్నాం బృందంలో మొత్తం 14 మంది ఉన్నారు. ఈ నెల 4వ తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు వీరంతా. అక్కడి నుంచి 9వ తేదీన నాంపల్లి స్టేషన్‌కు చేరుకొన్నారు. వీరి వెంట ఇద్దరు గైడ్లు ఉన్నారు. మొత్తం 12 మంది పెద్దలతో పాటు, ఇద్దరు పిల్లలు నల్గొండకు 9వ తేదీన వచ్చారు. వాళ్ళు నల్గొండకు వచ్చి 10 రోజులైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో అందరిని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ఎవరికి కరోనా లక్షణాలు లేవని పోలీసులు, జిల్లా వైద్య అధికారులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త కోసం వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. ఐతే ఇప్పటికే ఫీవర్ హాస్పిటల్లో వారికి పరీక్షలు చేశారు. పలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

 

మరోవైపు...కరోనా ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవాలయాలపైనా పడింది. జిల్లాలోని చెరువు గట్టు దేవాలయం, యాదాద్రి టెంపుల్, మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలను మూసివేశారు. కరోనా ప్రభావంతో  ప్రధాన దేవాలయాల్లోకి  భక్తులను అనుమతించడం లేదు. కరోనా ప్రభావం అటు పెళ్లిళ్లపైనా పడింది. భయంతో పెళ్లిళ్లకు ఎవరూ వెళ్లడం లేదు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో వివాహ వేడుకకు కరోనా దెబ్బపడింది. నకిరేకల్‌లో ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న వివాహానికి బంధువులు, సన్నిహితులు ఎవరూ కూడా కరోనా భయంతో వేడుకలకు హాజరుకాలేదు. బంధువులు, సన్నిహితులు, జనాలు లేక వెలవెలబోయింది కళ్యాణ మంటపం. బంధువులు వివాహానికి రాకపోయినా వివాహ తంతును మాత్రం ఉన్న కొద్ది మందితోనే ముగించారు. మొత్తానికి...కరోనా భయంతో నల్గొండ జిల్లా వాసులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: