కరోనా ఎఫెక్ట్ తో గుంటూరు మిర్చి రైతులకు కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. తమిళనాడు, మహారాష్ట్ర సరిహద్దుల్లో మిర్చి ఎగుమతులు నిలిపివేస్తున్నారు. ఇదే కొనసాగితే  మిర్చి రైతులకు మరిన్ని కష్టాలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

 

కరోనా వైరస్ గుంటూరు మిర్చి రైతుల కొంప ముంచుతోంది. ఇప్పటికే  చైనా, సింగపూర్, థాయ్‌లాండ్, లాంటి దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పుడు రాష్ట్రాల మధ్య సరిహద్దుల్లో కూడా మిర్చిని నిలిపివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలతో మిర్చి రైతుల పరిస్దితి అగమ్యగోచరంగా మారింది. ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డు నుంచి ఎగుమతులు భారీగా ఉంటాయి. ఈ సీజన్‌లో పంట ఉత్పత్తి కూడా పెరిగింది. ఫలితంగా నాణ్యతతో కూడిన మిర్చి మార్కెట్‌కు వచ్చింది. సీజన్ ఆరంభంలో మిర్చి ఘాటు విదేశాలను సైతం ఆకర్షించింది. క్వింటా మిర్చి ధర తేజ రకం 22 వేలకు పెరిగిపోయింది. ఐతే ఇది ఎంతో కాలం నిలవలేదు. ఆ వెంటనే కరోనా వైరస్ బయటపడింది. అత్యధికంగా ఎగుమతులు జరిగే చైనాకు మిర్చి ఆగిపోయింది. దాని ప్రభావం ఇతర దేశాలపైనా పడింది. 

 

ఇక...ఇప్పుడు గుంటూరు నుంచి మిర్చి ఎగుమతుల ప్రభావం రాష్ట్రాలపైనా పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల సరిహద్దుల్లో మిర్చి ఎగుమతులపై అనధికారికంగా ఆంక్షలు పెడుతున్నారు. ఫలితంగా మిర్చి రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. దీని ప్రభావం ధరలపై పడే అవకాశం ఉంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.

 

మరోవైపు...గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఇప్పటి వరకు కూడా ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. తేజ రకం మిర్చి 13 వేల వరకు పలుకుతోంది. మిగిలిన మిర్చి రకాలు 11 వేల వరకు ధర పలుకుతున్నాయి. రాష్ట్రాల మధ్య మిర్చి ఎగుమతులు ఆగిపోతే దరలు అమాంతం పడిపోయే ప్రమాదం ఉంది. రోజుకు 5 వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ధరలు పడిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో మిర్చి రైతులకు నష్టం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు అధికారులు.

 

కరోనా ప్రభావం ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి మార్కెట్‌పై చూపిస్తోంది. ఈ పరిస్దితుల నుంచి రైతులను బయటపడేసేందుకు ఏపీ సర్కారు అన్ని రకాలు చర్యలు చేపట్టింది. మరి రైతులకు గిట్టుబాటు ధర ఎంత మేరకు లభిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: