గొడ్డుబోయి ఒక‌డు ఏడిస్తే.. చియ్య‌కోసం మ‌రొక‌డు ఏడ్చాడంట‌!  ఇప్ప‌డు మీడియా.. అందులోనూ ఎల‌క్ట్రానిక్ మీడియా సంగ‌తి అయితే అచ్చం చియ్య కోసం ఏడ్చిన‌ట్టే ఉంటుంది ఎప్పుడూ! అవ‌స‌రానికి మించి అతిచేయ‌డం, ప‌తిని కోల్పోయి స‌తి ఉంటే.. మ‌తిలేని ప్ర‌శ్న‌లు వేయ‌డం.. సుతిమెత్త‌ని విష‌యాన్నిగ‌తిత‌ప్పి చూపించ‌డం.. చివ‌రికి చిన్న విష‌యాన్ని ప‌ట్టుకుని కొబ్బ‌రిచిప్ప దొరికిన కోతిలా గంతులువేయ‌డం.. తిర‌గేసి, మ‌ర‌గేసి, కింద‌మీద ప‌డేసి, చెప్పిందే చెప్ప‌డం.. అబ్బో..! ఇలా చెప్పుకుంటూ పోతే! ఒక్క ఎపిసోడ్‌తో ఒడిసే ముచ్చ‌ట‌కాదులే మీడియాది! ఇక ప‌లువురు జ‌ర్న‌లిస్టులూ రాజ‌కీయ నేత‌ల్ని త‌ల‌ద‌న్నుతున్నారు. ఎక్క‌డిపాట అక్క‌డ పాడ‌డంలో దిట్ట‌లు! ఏ గ‌డ‌ప‌కాడ ఆ ముచ్చ‌ట అందుకోవ‌డంలో కొబ్బ‌రిమ‌ట్ట‌లు! అయినా.. పార్టీకో ప‌త్రిక‌.. అందులో ప‌నిచేసేవారంద‌రూ కండువాలు క‌ప్పుకోని కార్య‌క‌ర్త‌లే! ఇందులో కొత్తేమీ లేదు! అందునా మీకూ తెలియ‌నిది అంత‌క‌న్నాకాదులే! అయితే, ఇంత‌కీ ఇప్పుడెందుకు మీడియా, జ‌ర్న‌లిస్టుల ముచ్చ‌ట చెబుతున్నార‌ని అనుకుంటున్నారా..? ఇందుకూ ఓ కార‌ణం ఉందిలేండి.. 

 

ఒక్క‌సారి.. ఒకేఒక్క‌సారి.. ముందుగా మీడియా అతిగురించి రెండుమూడు ఉదాహార‌ణ‌ల‌ను చెప్పుకుందాం.. హీరోయిన్ శ్రీ‌దేవి మ‌ర‌ణించిప్పుడు మీడియా చేసిన హ‌డావుడిని అంత‌సుల‌భంగా మ‌రిచిపోలేం.. 2018, ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌దేవి దుబాయ్‌లో మృతి చెందారు. ఆమె బాత్రూంలో గుండె పోటుతో ప్రాణాలు విడిచారు. ఇక మ‌న‌ తెలుగు చాన‌ళ్లు అతిగా ఏడ్చాయి. శ్రీ‌దేవి ఎలా మ‌ర‌ణించి ఉంటారో చూపించేందుకు నానాతంటాలు ప‌డ్డారు. ఏకంగా బాత్రూం ట‌బ్‌ల‌లో కూడా ప‌డుకుని చూపించారు.. క‌ర్మ క‌ర్మ‌! ఏం చేస్తాం మ‌రి. ఇక టాలీవుడ్‌లో జ‌రుగుతున్న కాస్టింగ్ కౌచ్‌కు నిర‌స‌న‌గా శ్రీ‌రెడ్డి అర్థ‌న‌గ్నంగా కూర్చుంటే.. మ‌న మ‌హామ‌హా జ‌ర్న‌లిస్టులు లైవ్ షో చూపించి, తమ అజ్ఞానాన్ని ప్ర‌ద‌ర్శించారు. కొబ్బ‌రిచిప్ప దొరికిన కోతిలా చుట్టూ గంతులు వేశారుగానీ.. ఓ క్లాత్ తెచ్చి ఆమెకు క‌ప్పుదామ‌న్న సంగ‌తిని మ‌రిచిపోయారు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్ర‌ణ‌య్ హ‌త్య కేసులోనూ మీడియా ఇలాగే బిహేవ్ చేసింది. భ‌ర్త‌ను కోల్పోయి.. భార్య అమృత ఏడుస్తుంటే.. మ‌న జ‌ర్న‌లిస్టులు గొట్టాలు ప‌ట్టుకుని వెళ్లి గుచ్చిగుచ్చి ప్ర‌శ్న‌లు వేశారు. 

 

సామాజిక బాధ్య‌త పేరుతో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే మ‌న మీడియా మిత్రులు క‌రోనా వైర‌స్ విష‌యంలో మాత్రం ఎందుకు ముందుకు రావ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు జ‌నంలో ఉద‌యిస్తున్నాయి. క‌రోనా బాధితుల‌తో ఒక్క‌రు కూడా మాట్లాడేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. వారి బాధ‌లేంటో తెలుసుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. ఎందుకంటే.. ఆ వైర‌స్ ఎక్క‌డ త‌మ‌కు అంటుకుంటుందోన‌ని భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అయినా.. ఒది కూడా ఒకందుకు మంచిదేలే..! లేదంటే మ‌న‌వాళ్లు వేసే ప్ర‌శ్న‌ల‌తో ఆ బాధితులు మ‌రింత అనారోగ్యానికి గుర‌య్యే ప్ర‌మాదం కూడా ఉంద‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు. మీడియా విచ్చ‌ల విడితనాన్ని కరోనా క‌ట్ట‌డి చేసిందంటూ జోకులు పేల్చుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: