దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 271 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశంలో కరోనాను కట్టడి చేయడానికి చైనా సహాయసహకారాలు అందిస్తామని ప్రకటన చేసింది. కరోనా అంతం కోసం ప్రయత్నిస్తున్న దక్షిణాసియా, యూరేసియా దేశాలకు సహాయసహకారాలు అందిస్తామని పేర్కొంది. 
 
ఈ విషయాలను చైనా తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకటించింది. ఈ కాన్ఫరెన్స్ లో దక్షిణాసియా, యూరేసియా దేశాల ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది ఇప్పటివరకూ కరోనా భారీన పడ్డారు. ఇటలీలో మృతుల సంఖ్య చైనా మృతుల సంఖ్యను దాటింది. కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలమవుతోంది. 
 
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో మోదీ రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. మరోవైపు భారత్ లో కరోనాను ఎదుర్కొనేందుకు చైనా సాయం అందిస్తుందని చైనా రాయబారి సన్ వీడంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చైనా ప్రతినిధులు కరోనాతో ఎలా పోరాడాలో భారత వైద్య, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖల ప్రతినిధులతో చర్చించారని అన్నారు. 
 
ఇప్పటికే ఈ వైరస్ దేశంలోని 22 రాష్ట్రాల్లో వ్యాపించింది. ఇప్పటివరకూ విదేశాల నుంచి భారత్ కు వచ్చిన వ్యక్తులకే కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇండియన్ కౌన్సిల్ అథారిటీ ఆఫ్ ఇండియా శ్వాసకోశ వ్యాధులు, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, దగ్గు, జ్వరంలో ఆస్పత్రిలో చేరే రోగులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించనుంది.                          

మరింత సమాచారం తెలుసుకోండి: