తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. కరోనా కట్టడి ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో 52 చెక్ పోస్టులు పెట్టామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై నియంత్రణ పెట్టామని పేర్కొన్నారు. విదేశాల నుంచి వస్తున్న వాళ్లతోనే సమస్య అని... రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి వారే కారణమని సీఎం చెప్పారు. 
 
తెలంగాణలో 11 వేల మంది ప్రభుత్వం అదుపులో ఉన్నారని సీఎం అన్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రానికి 1500 మంది విదేశాల నుంచి వచ్చినట్లు తెలిపారు. వేరే ఎయిర్ పోర్టుల్లో దిగి వస్తున్న వారి వల్లే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. 20,000 మందికి పైగా విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా నిరోధానికి 5274 బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు. 
 
జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే మాత్రం తక్షణం రిపోర్ట్ చేయాలని సూచించారు. రేపు జనతాకర్ఫ్యూ నేపథ్యంలో ఎమర్జెన్సీ కోసం 5 బస్సులు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల బస్సులను అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.. రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రో నడవవని అన్నారు. షాపులు, దుకాణాలు మూసివేయాలని వ్యాపారులకు సూచించారు. 
 
రేపు ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప ఏవీ నడవవని సీఎం స్పష్టం చేశారు. మహారాష్ట్ర బార్డర్ ను మూసివేసే ఆలోచన చేస్తున్నామని అన్నారు. రోజుకు వెయ్యి మందిని పరీక్షించే సదుపాయం రాష్ట్రంలో ఉందని సీసీఎంబీలో నిర్ధారణ పరీక్షలకు కేంద్రం అనుమతిచ్చిందని తెలిపారు. స్వీయ నియంత్రణే కరోనా నుండి మనల్ని కాపాడుతుందని కేసీఆర్ అన్నారు.                     

మరింత సమాచారం తెలుసుకోండి: