తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడిన వ్యక్తుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవలసిన తగిన చర్యల గురించి మాట్లాడారు. ప్రధాన నరేంద్ర మోడీ ఆదివారం అనగా మార్చి 22న ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఎవరూ కూడా ఇంటి నుండి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేస్తే... తెలంగాణ సీఎం కెసిఆర్ మాత్రం మార్చి 22న ఉదయం 6 గంటల నుండి మార్చి 23 ఉదయం 6 గంటల వరకు అనగా 24 గంటల పాటు అందరూ ఇంట్లోనే ఉండి జనతా కర్ఫ్యూ ని పాటించాలంటూ ఈరోజు ప్రెస్ మీట్ లో పిలుపునిచ్చారు.




ఆయన మాట్లాడుతూ... 'తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం కావాలి. అందుకే 24 గంటల కర్ఫ్యూ ని మనమందరం తూచా తప్పకుండా పాటించాలి. రేపు బస్సులను కూడా బంద్ చేస్తున్నాం. ప్రతి జిల్లా డిపో కి కేవలం ఐదు బస్సులు సిబ్బందితో సహా సిద్ధంగా ఉంటాయి. కానీ అవి మాత్రం కేవలం అత్యవసరమైన అవసరాల కోసమే ఉపయోగించబడతాయి. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఏ బస్సులని మన రాష్ట్రంలోకి అనుమతించబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మెట్రో ట్రైన్ లు కూడా రద్దు చేస్తున్నాను. కేవలం 5 ట్రైన్ లు మాత్రమే రేపు నడుస్తాయి. అవి కూడా అత్యంత అవసరమైన పరిస్థితులు కోసమే ఉపయోగించబడతాయి. ఇతర దేశాల నుండి వస్తున్న వారివల్లే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. వచ్చిన వారినల్లా గుర్తించి వెంటనే చికిత్స చేయించి అనుమానితులను క్వారంటైన్ కేంద్రములలో ఉంచుతున్నాం. ఒకవేళ ఎవరైనా విదేశీయులు మార్చి 1 తరువాత తెలంగాణ రాష్ట్రంలో కి అడ్డుపెట్టి ఉంటే వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులు చేపించుకోవాలి.' అని దణ్ణం పెడుతూ విజ్ఞప్తి చేశారు.



ఇకపోతే ఇండోనేష‌యిన్లు, వియ‌త్నామీలు, మ‌లేషియ‌న్లు ఇత‌ర దేశాల వారు మొత్తం కలిపి 20 వేల మంది పైచిలుకు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చారని... వారిని పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి... ఆపై నిఘా బృందాలు ఏర్పాటు చేసి సుమారు 11 వేల మందిని గుర్తించామని... ఇప్పటికే ఐదువేల మందిని పర్యవేక్షణలోకి తీసుకొని టెస్ట్ లు చేస్తున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇకమీద మరేతర విదేశీయులు తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: