ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం కోసం ఒక యువకుడు దొంగగా మారాడు. ఉద్యోగం లేకపోవడం... బంధువులు, స్నేహితులను సహాయం కోరినా ఫలితం లేకపోవడంతో యువకుడు దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్లాన్ సక్సెస్ అవ్వడంతో దొంగతనం చేసి ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం పోలీసులకు చిక్కి జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే హైదరాబాద్ లోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన సుమన్ మలక్ పేట లోని ఒక వాటర్ ప్లాంట్ లో తక్కువ జీతానికి పని చేస్తున్నాడు. అతడు ఒక యువతిని పేమించగా ఆమె కూడా అతడిని ఇష్టపడింది. ఇద్దరూ మార్చి 16న పెళ్లి చేసుకోవాలని ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకవడంతో సుమన్ యాకత్ పురా రైల్వే స్టేషన్ లో మహిళా కండక్టర్ గా పని చేసే భార్గవి బ్యాగు కొట్టేశారు. 
 
బ్యాగులో 25,000 రూపాయల నగదుతో పాటు ఏటీఎం కార్డు, సెల్ ఫోన్, ఐడీ కార్డు ఉన్నాయి. మహిళా కండక్టర్ బ్యాగు పోవడంతో వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు పోయిన యువతి సెల్ ఫోన్ పై కూడా నిఘా పెట్టారు. అదే సమయంలో యాకుత్ పురా రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సుమన్ ను పోలీసులు గుర్తించారు. 
 
అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పెళ్లి కోసం దొంగగా మారిన యువకుడి కథ తెలిసి పోలీసులు షాక్ అవ్వడంతో పాటు ఆశ్చర్యపోయారు. పోలీసులు యువకుడి దగ్గరినుండి ఏటీఎం కార్డ్, సెల్ ఫోన్, ఐడీ కార్డ్, 3100 రూపాయల నగదు, బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. దొంతనం చేసిన సుమన్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు.        

మరింత సమాచారం తెలుసుకోండి: