ముక్కలేనిదే ముద్ద దిగని వాళ్లు... కరోనా వైరస్ దెబ్బకు కిక్కురుమనకుండా శాకాహారం తినేందుకే మొగ్గు చూపిస్తున్నారు. పప్పు, కూరగాయలు కొనడానికి క్యూలో నిలబడుతున్నారు. చికెన్ రేట్లు సగానికి సగం పడిపోయినా.. అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. వైరస్ భయంతో పూర్తిగా ఆహారపు అలవాట్లనే మార్చేసుకుంటున్నారు. విశాఖలో రైతు బజార్ల వద్ద కూరగాయల కోసం ఉదయం నుంచే జనం క్యూ కడుతున్నారు. 

 

మాంసాహార ప్రియులకు కరోనా భయం పట్టుకుంది. ఆకుకూరలు, కూరగాయలు తింటే కరోనా వైరస్ రాదనే అపోహతో ప్యూర్ వెజిటేరియన్లుగా మారిపోయారు. అప్పు చేసి పప్పు కూడు తినడానికి రెడీ అంటున్నారు. కానీ మాంసం వైపు వెళ్లడం లేదు. దీంతో మెల్లమెల్లగా రైతు బజారుల్లో కూరగాయలకు డిమాండ్ పెరుగుంది. నిన్నమొన్నటి వరకు సాధారణ ధరలు పలికిన కూరగాయలు ఆకాశాన్నంటుతున్నాయి.

 

మాంసాహారం తింటే వైరస్ వస్తుందనే ప్రచారం సోషల్‌ మీడియాలో ఎక్కువగా సాగుతుండండంతో.. అందులో వాస్తవం లేకపోయినా ప్రజల్లో భయం మాత్రం విపరీతంగా కనిపిస్తోంది. మరో వైపు సమ్మర్ సీజన్ కావడంతో.. మాంసాహరం జోలికి వెళ్లక పోవడమే మంచిదంటున్నారు నగరవాసులు.

 

ఇక రైతు బజార్లలో జన సమ్మర్ధం ఎక్కువగా ఉండడంతో భయాందోళనలకు గురవుతున్నారు ప్రజలు. మాస్కులు ధరిస్తూ.. తుమ్ములు, దగ్గులు ఉండే వారికి దూరంగా ఉంటున్నారు. రైతు బజారుకు వచ్చే ప్రజలకు సైతం ప్రభుత్వం కరోనాపై అవగాహన కల్పించాలంటున్నారు వ్యాపారులు. మరోవైపు.. మార్కెట్లో కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో స్టాక్‌ను పెంచుకుంటున్నారు వ్యాపారస్థులు. రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి కరోనా దెబ్బకు ప్రజల ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. మాంసాహార ప్రియులు సైతం శాకాహారులైపోతున్నారు. ఇంకేముంది కూరగాయల ధరలకు రెక్కలొచ్చే అవకాశముంది. ఇది నిజమైతే ఏంటో పరిస్థితి.. అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: