కరోనా వైరస్ ను అడ్డుకోవడంలో..దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా నిలవాలన్నారు సీఎం కేసీఆర్. ప్రదాని మోడీ పిలుపుతో రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు అందరూ బంద్ పాటించాలని సూచించారు. ఎమర్జెన్సీ సర్వీసులు మినహా...మిగితా వారు కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు ఎవరూ బయటకు రావొద్దని, కూలీలు, రైతులు, కార్మికులు కూడా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. షాపులు, మాల్స్, మార్కెట్లు బంద్ పాటించాలని కోరారు. కర్ఫూలో భాగంగా...రేపు ఆర్టీసీ, మెట్రో సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు సీఎం. ఎమర్జెన్సీలో వాడుకునేందుకు డిపోకు 5 బస్సులు, 5మెట్రో రైళ్లను సిద్దంగా ఉంచామన్నారు.

 

 

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు కేసీఆర్. అవసరమైతే.. రాష్ట్రాన్నే షట్ డౌన్ చేస్తామన్నారు. ప్రజల ప్రాణాలకంటే ఏవీ ముఖ్యం కాదని...ఇదే పరిస్థితికనక వస్తే... ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి నిత్యవసరాలను ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెండు మూడు రోజుల్లో మహారాష్ట్ర బార్డర్ ను పూర్తిగా బంద్ చేస్తామని. అవసరానుకూలంగా మిగితా బోర్డర్లను మూసివేస్తామన్నారు. రేపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను కూడా బార్డర్లలోనే నిలిపివేస్తామని ప్రకటించారు. సరిహద్దుల్లో 52 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని..వీటిని పరిశీలించేందుకు 78 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామన్నారు.

 

 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 మందికి కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చిందన్నారు కేసీఆర్. దాదాపు 700 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని.. వీళ్లంతా విదేశాల నుంచి వచ్చినవారేనని తెలిపారు. వీళ్లను 14 రోజులపాటు ప్రత్యేక వార్డులో పర్యవేణలో ఉంచి తర్వాత నెగిటీవ్ వస్తే ఇళ్లకు పంపిస్తామన్నారు.

 


పదేళ్లలోపు పిల్లలు, 60ఏళ్లు దాటిన వృద్దులు రెండు మూడు వారాల పాటు ఇళ్లే పరిమితం కావాలన్నారు సీఎం. రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగితే...సీసీఎంబీ ని కరోనా టెస్టుల కోసం వాడుకునేందుకు కేంద్రం అనుమతిచ్చిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: