రాష్ట్రంలో తొలి సారిగా కరోనా వైరస్ ప్రైమరీ కాంటాక్ట్ కేసు నమోదైంది. ఇంతకాలం విదేశాల నుంచి వచ్చిన వారికే పరిమితమైన వైరస్...తాజాగా స్థానికుడికి సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారితో కలిసిన ఓ వ్యక్తికి కరోనా పాజిటీవ్ వచ్చిందని తెలిపింది రాష్ట్ర వైద్య ఆరొగ్య శాఖ. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు రాష్ట్రంలో 21 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అన్ని కేసుల్లో ప్రయాణికులు దాదాపు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారే. ఇక్కడున్న ఒక్క వ్యక్తికి కూడా వైరస్ సోకలేదు. అయితే తాజాగా తొలి ప్రైమరీ కాంటాక్ట్ పాజిటీవ్ కేస్ రావడంతో అలర్ట్ అయ్యింది ప్రభుత్వం. 

 

 

కోవిడ్ పేషెంట్ తో సన్నిహితంగా ఉన్న 35 ఏళ్ల హైదరాబాదీకి కరోనా వచ్చినట్టు ప్రకటించింది వైద్యఆరోగ్యశాఖ. దుబాయ్‌ టూర్ కు వెళ్లి మార్చి 14న హైదరాబాద్ వచ్చిన పేషంట్ కు దగ్గు, జ్వరం, జలుబు రావడంతో మార్చి 17న పరీక్షలు చేయించుకున్నాడు. గాంధీ హాస్పిటల్ లో నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటీవ్ రావడంతో...శాంపిల్స్ ను పుణే ల్యాబ్ కు పంపారు అధికారులు. అక్కడ కూడా వైరస్ నిర్థారించడంతో...గాంధీలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అయితే పేషేంట్‌తో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి పరీక్షలు చేయగా.. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. పేషెంట్ నుంచి ఇతడికి కరోనా సోకినట్టు నిర్థారించారు. 

 

 

వైరస్ సోకిన స్థానికుడికి కూడా గాంధీలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని... ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు. కాగా వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. వీరిలో ఒకరు ఇప్పటికే డిశ్చార్జి కాగా.. మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది విదేశీయులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: