మామూలుగా యుద్ధమంటే చేతికి ఆయుధాలు తీసుకుని కదనరంగంలోకి దిగటమే అందిరికీ తెలిసింది. కానీ మన ఇంట్లోనే కూర్చుని కనిపించని శతృవుతో యుద్ధం చేయటం మాత్రం బహుశా ఇదే మొదటిసారేమో అందరికీ. యుద్ధమంటే దేశంలోని మొత్తం ప్రజల తరపున సైనికులు మాత్రమే చేసేది. కానీ ఆదివారం ఉదయం మొదలవ్వబోయే యుద్ధం మాత్రం దేశంలోని మొత్తం 130 కోట్లమంది చేయబోతున్నది.

 

ఆ యుద్ధం పేరే ప్రధానమంత్రి నరేంద్రమోడి చెప్పినట్లు ’జనతా కర్ఫ్యూ’. దేశ సరిహద్దులు దాటి లోపలికి వచ్చేసిన శతృవుతో సైనికులు యుద్ధం చేయలేరు. అందుకనే మొత్తం ప్రజలందరినీ యుద్ధం చేయాలంటూ మోడి పిలుపిచ్చారు. ఇక్కడ యుద్ధమంటే ఎలాగూ శతృవు కంటికి కనబడడు కాబట్టి మనం కూడా శతృవు నుండి దూరంగా ఉండటమే. కేసియార్ చెప్పినట్లు మన శతృవుకు స్వాభిమానం ఎక్కువ.

 

తనంతట తానుగా మన శతృవు (కరోనా వైరస్) మన దగ్గరకు రాడు. మనం దాని దగ్గరకు వెళితేనే శతృవు మనల్ని హత్తుకుంటాడు. కాబట్టి మనం దాని దగ్గరకు వెళ్ళనంత వరకు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందుకనే ఆదివారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ ఎవరి ఇంట్లో వాళ్ళను ఉండాలంటూ ప్రధాని పిలుపిచ్చింది. చైనాలో పుట్టిన ఈ శతృవు ప్రస్తుతం ఇటలీ, ఇరాన్ దేశాలను వణికించేస్తోంది.

 

మన దేశంలోని జనాలను కూడా కబళించేయటానికి రెడీ అవుతోంది. కాబట్టి ఈ స్దితిలోనే దాన్ని నియంత్రించకపోతే ముందు ముందు మరింత కష్టమవుతుంది. అందుకనే చికిత్స కన్నా నియంత్రణే మిన్న అన్న సూత్రం ఆధారంగానే ప్రధానితో పాటు యావత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదివారం ఎవరూ బయటకు రావద్దని పదే పదే చెబుతున్నది.  ఆదివారం నాడు దేశంమొత్తం మీద ఒక్కళ్ళు కూడా అంటే అత్యవసరాలను మినహాయిస్తే ఇంకెవరు కూడా బయటకు రాకపోతే  శతృవు విస్తరణ దాదాపు నియంత్రణ అయినట్లే అని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. కాబట్టి జనాలు ఆదివారం ఇంట్లోనే కూర్చుంటే శతృవుతో యుద్ధం చేసినట్లే లెక్క.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: