ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కబళిస్తున్న కరోనా వైరస్ పై యుద్ధం చేసేందుకు ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్) ముందుకు వచ్చింది. క‌రోనా పై ప్రతి ఒక్కరూ చేస్తున్న వ్యతిరేక పోరాటంలో భాగంగా తమ వంతుగా కృషి చేస్తామన్న‌ సదరు సంస్థ భారతదేశంలో కరోనా వైరస్‌తో పోరాడటానికి రూ .100 కోట్లను సాయం అందిస్తున్నట్టు  శుక్రవారం ప్రకటించింది. ఇక క‌రోనాకు బ్రేక్ వేసేందుకు  శానిటైజర్లు, సబ్బులను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రకటించింది.



ఇక ప్ర‌తి ఒక్క‌రు వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌తో పాటు ఇంటి ప‌రిశుభ్ర‌త‌కు వాడే త‌మ కంపెనీకి చెందిన అన్ని ఉత్ప‌త్తుల‌ను చాలా త‌క్కువ రేట్ల‌కే అందిస్తున్న‌ట్టు కూడా అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ సంస్థ ప్ర‌స్తుత క‌ష్ట‌కాల నేప‌థ్యంలో ప్ర‌జా ప్ర‌యోజ‌నాలే ముఖ్యంగా ప‌ని చేస్తుద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. త‌మ కంపెనీకి చెందిన లైఫ్‌బాయ్‌ శానిటైజర్‌, లిక్విడ్ హ్యాండ్ వాష్, డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్‌ల ధరలను  15 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్లు తెలిపింది.



అలాగే త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా 2 కోట్ల లైఫ్ బాయ్ స‌బ్బుల‌ను ఫ్రీ గా అందిస్తున్నామ‌ని తెలిపింది. ఇలా జాతీయ విప‌త్తు సంక్షోభ స‌మ‌యంలో త‌మ లాంటి కంపెనీలు మ‌రింత కీల‌క పాత్ర పోషించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఈ సంస్థ తెలిపింది. ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్టు చెప్పారు. అలాగే ప‌తంజ‌లి, గోద్రెజ్ త‌దిత‌ర సంస్థ‌లు కూడా త‌మ స‌బ్బుల ధ‌ర‌ల‌ను 12.5 శాతం త‌గ్గింపు ప్ర‌క‌టించాయి.



ఏదేమైనా దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌పై యుద్ధం చేసేందుకు ప్ర‌ముఖ కార్పొరేట్ సంస్థ‌ల నుంచి.. సామాజిక సేవా సంస్థ‌లు సైతం ఉదారంగా విరాళాలు ప్ర‌క‌టించ‌డంతో పాటు త‌మ వంతుగా సాయాలు చేస్తున్నాయి. ఇక ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ ఆవ‌శ్య‌క‌త‌ను ?  క‌రోనా మ‌హ‌మ్మారిని ఎలా త‌రిమి కొట్టాలో కూడా ప్ర‌తి ఒక్క‌రు సోష‌ల్ మీడియా ద్వారా వివ‌రించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: