తెలంగాణ కు ఇప్పటికే విదేశాల నుంచి 20 వేలమంది వచ్చారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ , ఆ 20 వేలమంది వివరాల  గురించి అడిగే  ప్రయత్నం చేసిన  ఒక మీడియా ప్రతినిధి పై ఆయన  అంత ఎత్తున లేచారు . అసలు సదరు మీడియా ప్రతినిధి ప్రశ్న పూర్తికాకముందే కేసీఆర్ అదేమీ  దిక్కుమాలిన ప్రశ్న అంటూ విరుచుకుపడ్డారు . ఇక్కడే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి .  విదేశాల నుంచి రాష్ట్రానికి  వచ్చిన  20  వేలమంది ఎక్కడా ? అన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద సమాధానం లేదన్న విషయం స్పష్టమవుతోంది .

 

ఆ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ , సదరు మీడియా ప్రతినిధిపై అగ్గిమీద గుగ్గిలం మాదిరిగా విరుచుకుపడ్డారన్న వాదనలు విన్పిస్తున్నాయి  . విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి అంచనా వేయకుండానే తొలుత విమానాశ్రయం నుంచి  పంపించి వేసిన అధికారులు , విదేశాల్లో కరోనా వైరస్ తీవ్రత ను చూసి భయాందోళనతో ఇప్పుడు అప్రమత్తమయినట్లు కన్పిస్తోంది . అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ కూడా కరోనా వైరస్ గురించి చాల చులకనగా మాట్లాడిన విషయం తెల్సిందే . పారా సెట్ మాల్ టాబ్లెట్ వేసుకుంటే చాలు కరోనా తగ్గిపోతుందన్న ఆయన , రెండు రోజుల వ్యవధిలోనే కరోనా వైరస్ తీవ్రత , దానివల్ల పొంచి ఉన్న పెను ముప్పును అంచనా వేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు .

 

అయితే ప్రెస్ మీట్ లో సదరు మీడియా  ప్రతినిధి అడిగిన ప్రశ్నను కేసీఆర్  తనకు అనుకూలంగా మల్చుకుని ... విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 20 వేలమంది ఒకవేళ వ్యాధి లక్షణాలుంటే స్వీయ క్వారంటైన్ చేసుకోవాలని అప్పీల్ చేసి ఉంటే బాగుండేదని , అలాకాకుండా మీడియా ప్రతినిధిని తప్పు పట్టడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది . ఇప్పటికే 11 వేలమందిని క్వారంటైన్ చేశామని చెబుతున్న కేసీఆర్ మీడియా ప్రతినిధి  అడిగిన ప్రశ్నకు ఎందుకంత సీరియస్ గా  స్పందించారన్నదే సామాన్యులకు అంతు చిక్కని  ప్రశ్న అన్నది నిర్వివాదాంశమే . 

మరింత సమాచారం తెలుసుకోండి: