ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతోంది. దేశదేశాలకు విస్తరిస్తూ విజృంభిస్తున్న ఈ మహమ్మారి భారత్ ను కూడా తాకింది. ఇందులో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని జాగృతి చేసే సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. మార్చి 22న (ఈరోజు) జనతా కర్ఫ్యూ పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపును పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు తమ వంతు బాధ్యతగా ప్రజలకు చేరవేస్తున్నారు. దేశ పౌరులుగా మన ఐకమత్యం చూపించాల్సిన సమయం కూడా వచ్చింది.

 

 

యూరప్ లో మరణమృదంగం మోగిస్తోంది కరోనా. భారత్ లో ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ భయంకరమైన వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవిరళ కృషి చేస్తున్నాయి. వైద్యరంగంతో పాటు పౌరులుగా స్వచ్ఛందంగానూ తమ వంతు బాధ్యతను పాటించేందుకు కూడా జరుగుతున్న ప్రయత్నాలు సంతోషదాయకం. ఇందుకు ప్రజల నుంచి కూడా విశేష స్పందన రావడం శుభపరిణామం. సెలబ్రిటీలు తమ వంతు పాత్ర పోషించి జన జాగృతికి పాటుపడడం, ప్రజల్లోకి రావడం సంతోషకరమైన విషయమని చెప్పాలి.

 

 

విభిన్న మతాలు, కులాలు, భాషలు కలగలిపిన భారతదేశంలో అనుకోని ఏ విపత్తు ఎప్పుడు వచ్చినా సమిష్టిగా ఎదుర్కొన్న సందర్భాలు అనేకం. భారతీయులుగా మనం అంతా ఒకటి అని చాటిచెప్పాల్సిన సమయం వచ్చింది. రోజుల్లో కరోనా వైరస్ నియంత్రణ కోసం ఆస్పత్రి కట్టారని చైనా గురించి చెప్పుకోవడం కాదు. మందు కంటే ముఖ్యమైన వ్యక్తిగత బాధ్యతను భారత్ ఎంత గొప్పాగా పాటిస్తుందో ప్రపంచం అంతా చెప్పుకునే మహత్తర అవకాశం మనకు వచ్చింది. కోరలు చాస్తున్న ఈ మహమ్మారిని నియంత్రించేందుకు, భారత్ నుంచి తరమికొట్టేందుకు ఇదే సరైన తరుణం. అందరూ బాధ్యతగా తీసుకుని జనతా కర్ఫ్యూని పాటించి మనల్ని మనమే కాపాడుకుందాం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: