ఇటలీ.. ఇప్పుడు కరోనాతో ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా ఇబ్బంది పడుతున్న దేశం.. ఇబ్బంది అంటే చాలా చిన్నపదం అవుతుందేమో.. అక్కడ కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ ఇక్కడ కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు అసలు కరోనా ప్రాణం పోసుకున్న చైనాను మించిపోయి ఇక్కడ కరోనా విజృంభిస్తోంది.

 

 

కరోనా మరణాల్లోనూ ఇటలీ చైనాను మించిపోయింది. తాజాగా ఒక్క శనివారమే ఇటలీలో 793 మంది కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోయారు. అసలు కరోనా వైరస్ తో ఒక దేశంలో ఒక్కరోజు ఇంతమంది మృత్యువాత పడడం ఇదే అత్యధికం అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటలీలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,825కు చేరింది. మరో 6,557 మంది కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు.

 

 

ఇక ఇటలీలోని మిలన్‌ సమీపంలోని ఉత్తర లోంబార్డీ ప్రాంతంలో కరోనాతో 3000 మంది మరణించారు. ఇటలీలో పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం పది రోజుల నుంచి ఇటలీని పూర్తిగా లాక్ డౌన్ చేసేసింది. వీధుల్లో కనిపిస్తే తీసుకెళ్లి జైళ్లలో వేస్తున్నారు. భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఇంత నిర్భంధం అమలు చేస్తున్నా.. రెండు రోజుల్లో 1,420 మంది మృతి చెందారు.

 

 

ఆరంభంలో కరోనా పట్ల జనం చూపిన అశ్రద్ధే ఈ దారుణ పరిస్థితి కారణంగా చెబుతున్నారు. ఈ మరణ మృదంగం ఇటలీలో ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. దేశంలో అల్లకల్లోలం ఏర్పడింది. ఎంత అత్యవసరం ఉన్నా జనం బయటకు రాలేని పరిస్థితి. చైనా కరోనాను కట్టడి చేసి మృతుల సంఖ్య పెరగకుండా నిరోధించింది. కానీ ఇటలీ ఆ పని చేయలేకపోతోంది. మరి ఇంకెన్ని ప్రాణాలు బలికావాలో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: