ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని పిలుపుకు దేశ ప్రజల నుంచి భారీ స్పందన వ్యక్తమవుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జనతా కర్ఫ్యూలో భాగంగా కోదాడ దగ్గర ఏపీ తెలంగాణ సరిహద్దును ఈరోజు మూసివేశారు. 
 
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర సరిహద్దును కొంతకాలం మూసివేయాలని యోచిస్తోంది. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణకు మహారాష్ట్రతో ఐదు వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్ ప్రాంతాల్లో అదిలాబాద్, నిజామాబాద్ ప్రజలకు ఎక్కువగా బంధుత్వాలు ఉన్నాయి. 
 
ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం సమీక్ష నిర్వహించి మహారాష్ట్ర సరిహద్దు గురించి కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏపీలో జగన్ సర్కార్ ప్రజల సహకారంతో కర్ఫ్యూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నిలిపివేయగా... పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే ఏపీలో బంద్ ప్రభావం కనిపిస్తోంది. 
 
ప్రభుత్వం అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని పిలుపునిచ్చింది. జనం ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం ముందుజాగ్రత్తగా 108లు, ఆంబులెన్స్ లను సిద్ధంగా ఉంచింది. ప్రభుత్వం అత్యవసరాలకు మాత్రం బంద్ నుంచి మినహాయింపు ఇచ్చింది. వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 315కు చేరింది. తెలంగాణలో ఇప్పటివరకూ 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జనతా కర్ఫ్యూ వల్ల కరోనా ప్రభావం తగ్గే అవకాశం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: