అజాగ్రత్తతో ఇటాలియన్లలా కరోనాకు బలికావద్దని సూపర్ స్టార్ రజినీ కాంత్ దేశ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జనతా కర్ఫ్యూకు సంబంధించిన సూచనలు తెలిపారు. మన దేశంలో కరోనా వ్యాధి రెండో స్టేజ్‌లో ఉంది.. అది మూడో స్టేజ్‌లోకి వెళ్లకూడదు. అలా వెళ్లకుండా అడ్డుకోవడానికే ప్రధాని మోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. దీన్ని అందరం పాటిద్దామని పిలుపు ఇచ్చారు రజినీకాంత్.

 

 

ఇటాలియన్లు ప్రభుత్వం ఉత్తర్వులను సీరియస్ గా తీసుకోనందువల్లే ఇప్పుడు వేలసంఖ్యలో చనిపోతున్నారని రజినీకాంత్ అన్నారు. వారిలా మనం అజాగ్రత్తగా ఉండకూడదు. ఇటలీ పరిస్థితి భారత్‌లో రాకూడదు. యువకులు, పెద్దలు అందరూ కర్ఫ్యూకు సహకరించాలి. కరోనా నియంత్రణ కోసం తమ ప్రాణాలను లెక్క చేయకుండా వైద్య సేవలు చేస్తున్న అధికారులు, వైద్యులు, నర్సులను అభినందిస్తూ ప్రధాని చెప్పినట్లు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మనసారా అభినందిద్దామని రజినీ కాంత్ పిలుపునిచ్చారు.

 

 

రజినీకాంత్ చెప్పింది అక్షరాలా వాస్తవం.. ప్రస్తుతం ఇటలీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ ఇక్కడ కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా ప్రాణం పోసుకున్న చైనాను మించిపోయి ఇక్కడ కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఒక్క శనివారమే ఇటలీలో 793 మంది కరోనా వైరస్‌ వల్ల చనిపోయారు. ఇటలీలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,825కు చేరింది. మరో 6,557 మంది కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు.

 

 

వాస్తవానికి ఇటలీలో పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం పది రోజుల నుంచి ఇటలీని పూర్తిగా లాక్ డౌన్ చేసేసింది. అయినా జనం సీరియస్ గా తీసుకోలేదని చెబుతున్నారు. ఆరంభంలో కరోనా పట్ల జనం చూపిన అశ్రద్ధే ఈ దారుణ పరిస్థితి కారణంగా చెబుతున్నారు. మరి ఇండియా అలా కాకూడదంటే జనం కొన్నాళ్లు ఇబ్బంది పడక తప్పదు. కరోనా గొలుసును తెగ్గొట్టక తప్పదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: