తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం చిక్కినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీని ఏదో ఒక కారణంగా విమర్శిస్తుంటారు. అయితే శనివారం రోజు మాత్రం అకస్మాత్తుగా నరేంద్ర మోడీ పై ఎనలేని అభిమానం, ప్రేమ చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఎంత ప్రేమ అంటే... ఎవరైనా నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా వెంటనే వారిని అరెస్టు చేసి శిక్షించాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కి సూచించారు కెసిఆర్. 

 

 


గురువారం రోజు మోడీ జాతినుద్దేశించి మాట్లాడుతూ... మార్చి 22వ తేదీన అనగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నుండి బయటికి వచ్చి బాల్కనీలో నిల్చొని ఐదు నిమిషాల పాటు చప్పట్లు కొడుతూ... గంటలు మోగిస్తూ... ఈలలు వేస్తూ... మనమందర్ని సురక్షితంగా ఉంచేందుకు రోజులో 24 గంటలు పని చేస్తున్న వైద్యులకు, నర్సులకు, చెత్త శుభ్రం చేసే వారికి ఇంకా ఇతరులకు కృతజ్ఞతా భావం తెలపాలని పిలుపునిచ్చారు. అయితే మోడీ ఇచ్చిన ఈ పిలుపు ని కొంతమంది సామాజిక మాధ్యమాలలో ఎత్తి పొడుస్తూ ట్రోల్ చేస్తున్నారట. 

 

 

దాంతో చిర్రెత్తుకొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం రోజున ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... 'ఆయన(మోడీ) మన దేశానికి ప్రధానమంత్రి. ఆయన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. కానీ కొంతమంది పనికిరాని వ్యక్తులు మాత్రం ఐదు నిమిషాలు చప్పట్లు కొట్టమని పిలుపునిస్తే దాన్ని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆ పిలుపులో అస్సలు తప్పేముంది? మన కోసం నిర్విరామంగా మనం పనిచేస్తున్న వారికి సంఘీభావం తెలపడానికి ఆ పిలుపునిచ్చారు మోడీ గారు. ఇంకా మనందరం దానిని తప్పకుండా పాటించాలి' అంటూ మోడీ గురించి మొట్టమొదటిసారిగా ఎంతో ప్రేమగా మాట్లాడారు కెసిఆర్. 

 


'ప్రతి ఒక్క దానికి ఒక హద్దంటూ ఉంటుంది. ప్రధానిపై ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నేను డిజిపిని కోరాను. నేను కూడా మా ఎమ్మెల్యేలందరితో కలిసి కరోనా వైరస్ నిర్మూలించేందుకు శ్రమ పడుతున్న వారి కోసం చప్పట్లు కొడతాను ”అని కెసిఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: