ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కలవరపరుస్తున్న కరోనా వైరస్ సోకితే దానిని అధిగమించేందుకు ఖచ్చితమైన మందులు లేవు. ఇక వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు కానీ ఇప్పటికీ పెద్దగా ఫలితం రాలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలోని మొదటి కరోనా బాధితుడిని ఎలా ట్రీట్ చేశారు... ఏ చికిత్స అతనిని ఈ వైరస్ బారి నుండి బయటపడేసింది అన్నది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న.

 

కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ సోకిన ఒక ఐటి యువకుడు హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ వార్తతో తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడగా.... మందులేని ఈ వ్యాధిని నయం చేయడాన్ని గాంధీ వైద్యులు సవాలుగా తీసుకున్నారు. వైరస్ వల్ల మనిషి మొదట చూపించే లక్షణాలకు అనుగుణంగా మందులు ఇచ్చారు. అలాగే వివిధ దేశాల్లో కరోనా బాధితులకు మలేరియా, ఎయిడ్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఇచ్చే మందులను ఇచ్చి నయం చేసే ప్రయత్నంలో గాంధీ అస్పత్రిలోని వైద్యులు మంచి ఫలితం చూశారు.

 

ఆ తర్వాత అతనికి వైద్యం చేసేందుకు జనరల్ ఫిజీషియన్ తో పాటు పల్మనాలజిస్ట్, సైకాలజిస్ట్ లతో కూడిన ఒక టీమ్ రంగం లోకి దిగింది. ఇక అతని ఆరోగ్య పరిస్థితి మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత సరైన చికిత్స మొదలుపెట్టిన డాక్టర్లు అతనికున్న ఆరోగ్య ఇబ్బందులను క్షుణ్ణంగా పరిశీలించి హెచ్ఐవి కి ఇచ్చే మందులతో పాటు మలేరియా కోసం ఇచ్చే క్లోరొక్విన్ మరియు రపినవిర్ తో అతనిని ట్రీట్ చేశారు. ఈ సమయంలో బాధితుడు మానసిక ఆందోళనకు గురికాకుండా సైకాలజిస్ట్ ఇచ్చిన కౌన్సిలింగ్  కూడా బాగా ఉపయోగపడింది.

 

ఇన్ని జాగ్రత్తల నడుమ అతనికి ఉన్న ఆరోగ్య సమస్యల్లో ముందు జ్వరం తగ్గగానే న్యుమోనియా కొద్దిగా కంట్రోల్ అయింది. ఎనిమిది రోజులు ఇలాగే అతనికి చికిత్స చేయగా ఆ తరువాత జరిగిన టెస్టులో వైరస్ లేదని తేలింది. అనుకున్నట్లుగానే 14వ రోజు అతనిని పరిపూర్ణ ఆరోగ్యవంతుడి చేసి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం అతను ఇంట్లోనే ఉండగా అతని కుటుంబ సభ్యులలో కూడా ఈ వైరస్ కనిపించకపోవడం నిజంగా హర్షించదగ్గ విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: