దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 324కు చేరింది. తెలంగాణలో ఇప్పటివరకూ 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలపై పడింది. ప్రభుత్వం భక్తులను కొండపైకి అనుమతించడం లేదు. టీటీడీ అలిపిరి దారి, మెట్ల మార్గాలను మూసివేసింది. 
 
తిరుమలగిరులు భక్తులు లేక బోసిపోతుండగా స్వామి వారికి కైంకర్యాలు మాత్రం కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజుల నుండి తిరుమలలో వాహనాలను అనుమతించటం లేదు. కరోనా ప్రభావంతో టీటీడీ తీసుకున్న నిర్ణయాల వల్ల ముందుగానే ముహూర్తాలు ఖరారు చేసుకుని తిరుమలకు వచ్చిన జంటలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొంతమంది తిరుమలకు చేరుకుని అధికారులు అనుమతించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. 
 
తాజాగా ఒక జంట వివాహం చేసుకోవాలని తిరుమలకు రాగా అధికారులు అనుమతించకపోవడంతో రోడ్డుపైనే వివాహం చేసుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన జంట బంధుమిత్రులతో వివాహం చేసుకోవాలని తిరుమలకు రాగా పోలీసులు అలిపిరి మెట్ల దగ్గర వారిని ఆపివేశారు. కొంత సమయం పాటు ఏం చేయాలో అర్థం కాని ఆ జంట తిరుమలలోనే వివాహం చేసుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అలిపిరి గరుడ విగ్రహం సాక్షిగా ఆ జంట అక్కడే వివాహం చేసుకుంది. వరుడు వధువు మెడలో తాళి కట్టగా బంధుమిత్రులు వారిని ఆశీర్వదించారు. తిరుపతి అర్బన్ పోలీసులు ఈ పెళ్లి వేడుకకు పెద్దలుగా వ్యవహరించారు. అలిపిరి దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఈ వివాహ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ ను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: