దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. అయినా అడపా దడపా అక్కడక్కడా జనం కనిపిస్తున్నారు. ఏదైనా అత్యవసరం పనో.. ఏదో ఉండొచ్చు. అలాంటి వారిని ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇది జనం స్వచ్ఛందంగా పాల్గొనాల్సిన ఉద్యమం. ఇదేమీ రాజకీయ పార్టీలు పిలుపు ఇచ్చి చేయిస్తున్న బంద్ కాదు. కాబట్టి ఎవరి అప్రమత్తత వాళ్లకు ఉండాలి. 

 


కానీ అలా అని ఆ గ్రామం ఊరుకోలేదు.ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు నిజామాబాద్‌ ఆర్మూర్‌ మండలం మంథిని గ్రామాభివృద్ధి కమిటీ మద్దతు ప్రకటించింది. వినూత్నంగా స్పందించింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు బంద్‌ పాటించాలని, గ్రామస్థులు ఎవరూ బయట తిరిగినా రూ.వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గ్రామంలో చాటింపు వేయించింది. విదేశాల నుంచి గ్రామానికి ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని సూచించింది. 

 


అంతే కాదు.. ఆ గ్రామంలో మాంసం విక్రయ దుకాణాలు, సామాజిక భవనాలు, కల్యాణ మండపాలు మూసి ఉంచాలని యజమానులకు గ్రామ పెద్దలు సూచించారు. ఇప్పుడు ఈ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.  మన కోసం మనం చేస్తున్న కర్ఫ్యూ అన్న సంగతిని ఆ పల్లెటూరు బాగా అర్థం చేసుకుంది. ఈ స్ఫూర్తి దేశమంతా వెల్లివిరియాలి. అప్పుడే కరోనాను అడ్డుకోగలం. 

 


ఇప్పటికే తెలంగాణలో కరోనా క్రమంగా వ్యాపిస్తోంది. దీన్ని ఆరంభంలో అరికట్టకపోతే.. ముందు ముందు అరికట్టడం చాలా కష్టం అవుతుంది. గొలుసుల తరహాలో  వ్యాపించే ఈ కరోనాను ఆరంభంలో గొంతు నులిమేయాలి. కానీ తెలంగాణలో ఇప్పటికే రెండో దశ కేసు నమోదైంది. ఇక ఇప్పుడు తెలంగాణలో మూడో దశలోకి వెళ్లకుండా చూసుకోవాలి. రెండో వ్యక్తి నుంచి మూడో వ్యక్తి కి అంటే థర్డ్‌ కాంటాక్ట్‌కి సోకకుండా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మూడో వ్యక్తికి సోకితో.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం చాలా కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: