దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 324కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఇరు రాష్ట్రాల సీఎంలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
రైల్వే శాఖ జనతా కర్ఫ్యూ కారణంగా ఈరోజు రైళ్లను బంద్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడు రోజుల పాటు రైళ్లను బంద్ చేయాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ తాజా నిర్ణయంతో మార్చి 25 వరకు దేశవ్యాప్తంగా రైళ్లు రద్దు కాబోతున్నాయి. రైల్వే శాఖ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటం... రైళ్లలో కరోనా అనుమానితులు ప్రయాణిస్తున్నట్లు వార్తలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
కొన్ని రోజుల క్రితం కరోనా సోకిన 10 మంది ప్రయాణికులు రైలు ద్వారా కరీంనగర్ కు చేరిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి దేశంలోకి వస్తున్న వారు రైళ్ల ద్వారా ఎక్కువగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. రైళ్లలో కరోనా సోకిన ప్రయాణికులు ప్రయాణించటం వల్ల కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. రైల్వే శాఖ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 
కేంద్రం ఇప్పటికే అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో ఒకరు బీహార్ లో ఒకరు చనిపోగా కరోనా మృతుల సంఖ్య 6కు చేరింది. ముంబైలో 63 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా బీహార్ లో 38 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లినవారు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటూ ఉండటంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: