కరోనా విజృంభణ నేపథ్యంలో దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తుండడంతో రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఖాళీగా కనపడుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. తొలిసారిగా రాష్ట్రంలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ యువకుడి ద్వారా సదరు వ్యక్తికి కరోనా వైరస్ సంక్రమించినట్టు గుర్తించారు. హైదరాబాద్‌లో ఎల్లప్పుడు రద్దీగా కనపడే బస్టాండులన్నీ ఈ రోజు బోసిపోయి కనపడుతున్నాయి. దీంతో బస్టాండుల్లో కొందరు యువకులు క్రికెట్‌ ఆడుతున్నారు. ఈ రోజు జనతా కర్ప్యూ నేపథ్యంలో  సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం, మణుగూరు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. 

 

కొత్తగూడెం నుంచి నేడు బయలుదేరనున్న సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్, కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్, అలాగే, సికింద్రాబాద్ నుంచి బయలుదేరే మణుగూరు సూపర్‌ఫాస్ట్, కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్, సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.  ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఈ తరహాలో ఇదే మొదటి కేసు. దుబాయ్ నుంచి ఓ వ్యక్తి ఈ నెల 14న నగరానికి రాగా కరోనా లక్షణాల కారణంగా అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడికి కరోనా సోకినట్టు ఈ నెల 19న ప్రభుత్వం ప్రకటించింది. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తికి తాజాగా కరోనా సోకినట్టు వైద్యపరీక్షల్లో వెల్లడైంది.

 

దాంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరినట్టయింది.  ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది.మొత్తానికి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ బస్టాండులోకి స్థానిక యువకులు వచ్చి కాసేపు క్రికెట్‌ ఆడారు. అయితే, అక్కడికి మీడియా రావడాన్ని గమనించిన పోలీసులు.. క్రికెట్ ఆడుతోన్న యువకులను అక్కడి నుంచి పంపించేశారు. తెలంగాణలో 24 గంటల  జనతా కర్ఫ్యూ పాటిస్తుండడంతో అన్ని జిల్లాల్లోని ప్రధాన బస్టాండుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: