దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కేంద్రం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈరోజు కేంద్ర కేబినెట్ సెక్రటరీ, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనతా కర్ఫ్యూకు దేశవ్యాప్తంగా  ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చిందని అన్నారు. 
 
మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 75 జిల్లాలను లాక్ డౌన్ చేయాలని సూచించారు. కేంద్రం రాష్ట్రాలకు అత్యవసర రవాణా సౌకర్యాలు మినహా మిగతావన్నీ మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం సూచనలతో ఈ నెల 31 వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బస్సులు బంద్ అయ్యే అవకాశం ఉంది. కేంద్రం అంతర్జాతీయ రవాణా వ్యవస్థను కూడా నిలిపివేయనుందని తెలుస్తోంది. 
 
ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ చర్యల్లో భాగంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించాయి. ఒడిశా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరడంతో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ నెల 31 వరకు రైళ్లు బంద్ చేయబోతున్నట్లు ప్రకటన వెలువడింది. 
 
మార్చి 31 వరకు మెట్రో సర్వీసులను కూడా నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటివరకూ 341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 5 కేసులు నమోదయ్యాయి. మరికొన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.                    

మరింత సమాచారం తెలుసుకోండి: