ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని విపరీతంగా భయపెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు భారతదేశంలో ఒక్కసారిగా తన కొరలను విస్తరించింది. ఈరోజు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయానికి ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 370 దాటడం గమనార్హం. ఇక ఎలాంటి జాప్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్ల యొక్క రాకపోకలను నిలిపివేయడంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పక్క రాష్ట్రాలకు వెళ్లే బస్సు సర్వీసులను కూడా ఆపివేశారు.

 

ఒక రకంగా చెప్పాలంటే దేశం మొత్తం ఒక్కసారిగా హైఅలర్ట్ మూడు లోకి వెళ్లిపోగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే పూర్తిగా లాక్ డౌన్ ను ప్రకటించాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు కూడా మార్చి 31 వరకు పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మరొక మూడు రోజుల వరకు కర్ఫ్యూ కొనసాగనున్నట్లు కూడా బలమైన రిపోర్టులు వస్తున్నాయి.

 

కరోనా వైరస్ రోజురోజుకి తన పరిధిని దేశంలో పెంచుకుంటూ పోతూ ఉండడంతో దేశంలోని వైద్య సిబ్బంది అంతా చాలా ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ నెల 31వ తారీకు వరకు దేశంలోని ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండి ఈ వైరస్ ఎవరికి సోకకుండా ఉండేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఉత్తర్వులు జారీ చేయనున్నాయట. కాబట్టి రానున్న వారం మొత్తం ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారి తలకిందులు అయిపోవడం ఖాయం గా కనిపిస్తుంది. ఈ నెల ఆఖరుకు సరిపడా సరుకులను ముందుగానే ప్రజలు సమకూర్చుకోవడం మంచిది. ఇకపోతే ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించే అవకాశం కూడా త్వరలోనే ఉండబోతోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: