కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే ప్ర‌జ‌ల‌ గుండెల్లో గుబులు రేగుతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ ఎంద‌రో అమాయ‌కుల ప్రాణాలను బలి తీసుకుంటోంది.  కరోనా వైరస్ వస్తే దీనికి ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ వ్యాధి సోకిన వారికి రోజురోజుకి మరణానికి దగ్గరవుతారని చెబుతున్నారు నిపుణులు. దీంతో ప్ర‌జ‌లు ప్రాణాల‌కు గుప్పిట్లో పెట్టుకుని తిరుగుతున్నారు. ఇక ఇప్పటివరకు 188 దేశాలకు కరోనా వైరస్‌ విస్తరించింది. ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 13,017కి చేరగా.. 3 లక్షల 6 వేల మందికి కరోనా వైరస్ సోకింది. 

 

ఇదిలా ఉంటే..  కరోనా నిరోధం భద్రత చర్యల్లో భాగంగా హెరిటేజ్‌ ఫుడ్స్‌ పలు రక్షణలు తీసుకుంటున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. హెరిటేజ్ ఫుడ్స్‌ను చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రి, ఆయ‌న కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే క‌రోనా కార‌ణంగా హెరిటేజ్ ఫుడ్స్ విష‌యంలో నారా బ్రాహ్మ‌ణి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. దీంతో కార్పొరేట్‌, అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి నుంచే (వర్క్‌ ఫ్రం హోమ్‌) లేదా రొటేషన్‌ పద్ధతిన పనిచేసే అవకాశం కల్పించినట్లు కంపెనీ పేర్కొంది. అదే విధంగా తమ పాలు, పాల ఉత్పత్తుల తయారీలో మరింత నాణ్యత, నిర్వహణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. 

 

ఫ్యాక్టరీల్లో పని చేసే తమ సిబ్బందికి ప్రతీ రోజు స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేసిన తర్వాతే అనుమతిస్తున్నామని పేర్కొంది. మ‌రియు ప్రతీ రోజు పరిసరాలను శుభ్రం చేస్తున్నట్లు తెలిపింది. అలాగే కంపెనీ ఉత్పత్తుల డిస్ట్రిబ్యూషన్‌, డెలివరీలో భద్రత కోసం సేల్స్‌, డెలివరీ సిబ్బందికి ఫేస్‌ మాస్క్‌లు, చేతి తొడుగులు, శానిటైజర్లను అందజేసిననట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి తెలిపారు. ఇక హోమ్‌ డెలివరీ, ఈ-కామర్స్‌ ద్వారా హెరిటేజ్‌ పాలు, పాల ఉత్పత్తులను నిరంతరాయంగా సరఫరా చేస్తామని హామీ కూడా ఇచ్చారు. కాగా, క‌రోనా కార‌ణంగా నారా వారి కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి ప‌క్కా ప్లానింగ్స్‌,  త‌మ సిబ్బంది ఆరోగ్య సంబంధిత విష‌యాల‌పై తీసుకున్న జాగ్ర‌త్త‌ల‌కు ప‌లువురు శ‌భాష్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: