దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితమయ్యారు. దేశంలో నిన్న ఒక్క రోజులో 60 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 24 మంది బాధితులు కోలుకున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో కొత్తగా 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య 324కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ రోజు ప్రకటన చేసింది.

 

ఇదిలా ఉంటే ఈ రోజు మహారాష్ట్రలో ఓ వృద్దుడు కరోనాతో మరణించాడు.  మహారాష్ట్రలో ఇది రెండో మరణం. దీంతో దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరింది.  దేశంలో కరోనా సోకిన 324 మందిలో 41 మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో 74, కేరళలో 52, ఢిల్లీలో 27, ఉత్తరప్రదేశ్‌లో 25, రాజస్థాన్‌లో 24, తెలంగాణలో 21, హర్యానాలో 17 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 20, పంజాబ్‌లో 13, తమిళనాడులో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు జనతా కర్ఫ్యూ కి మంచి స్పందన వచ్చింది.. దేశంలోని అన్ని ప్రాంతాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ బోసిపోయి కనపడుతున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. జనతా కర్ఫ్యూ స్ఫూర్తిగా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి.

 

తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా మార్చి 31 వరకు లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మేరకు ఓ కీలక సమావేశం ఏర్పాటు చేసి.. ఈ విషయం ప్రకటిస్తారని తెలుస్తోంది. లాక్ డౌన్ విధిస్తే అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన మహారాష్ట్ర కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతోంది. లాక్ డౌన్ అంటే.. కొన్ని కీలక సర్వీసులు తప్ప మిగతావన్నీ నిలిచిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: