కరోనా వైరస్... ఈ పేరు చెబితే చాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గజగజా వణుకుతున్నారు. భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 341కు చేరింది. కరోనా భారీన పడి ఈరోజు మరొకరు మృతి చెందారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో కరోనా భారీన పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఒకేరోజు దేశంలో ముగ్గురు కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందడం గమనార్హం. దీంతో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది. 
 
మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం ప్యాసింజర్ రైళ్లు, మెట్రో, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేయనున్నట్లు ప్రకటన చేసింది. రైల్వే శాఖ 31వ తేదీ అర్ధరాత్రి వరకు ప్యాసింజర్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. గూడ్స్ రైళ్లు మాత్రమే నడవనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం అత్యవసర ప్రయాణాలకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నాయి. 
 
మరోవైపు ఏపీలో మరో రెండు రోజుల పాటు జనతా కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఇప్పటికే అధికారులతో కర్ఫ్యూ పొడిగింపు గురించి చర్చలు జరిపారు. కేంద్రం నిర్దేశించిన నియమాలను విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో పాటించాలని సూచించారు. సీఎం రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల గురించి ప్రధానంగా చర్చించారు. 
 
ఔషధాలు, చికిత్సా సదుపాయాలు, ఐసోలేషన్ వార్డుల గురించి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జగన్ కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ప్రజలకు వివరించనున్నారు. జగన్ ఈ సమావేశంలో మరో రెండు రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగింపు గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.                  

మరింత సమాచారం తెలుసుకోండి: