ప్రపంచంలో కంటిమీద కునుకున లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు అన్ని దేశాలకు వ్యాపించిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తుండడంతో రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఖాళీగా కనపడుతున్నాయి.   కొంత మంది మాత్రం రోడ్లపైకి వచ్చారు. దీంతో వారిని పోలీసులు వెనక్కి పంపిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ సిగ్నల్స్ వద్ద రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపిన సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ వారి వివరాలు తెలుసుకున్నారు. బయటకు ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. వారిని అక్కడి నుంచి తిరిగి పంపించారు. కర్ఫ్యూ కాదని 'కేర్ ఫర్ యూ' అని సజ్జనార్‌ చెప్పారు.

 

ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని ఆయన చెప్పారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఆయన సూచించారు.  తెలంగాణలో 24 గంటల  జనతా కర్ఫ్యూ పాటిస్తుండడంతో అన్ని జిల్లాల్లోని ప్రధాన బస్టాండుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  జనతా కర్ఫ్యూలో ఎవరూ పాల్గొనకూడదంటూ సంగారెడ్డి 34వ వార్డు కౌన్సిలర్‌ మహమ్మద్‌ సమీ సోషల్‌ మీడియాలో పలు వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ రోడ్లపైకి రావాలన్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కరోనాపై పోరులో భాగంగా జనతా కర్ఫ్యూ దిగ్విజయంగా నడుస్తోంది. హైదరాబాదులో ఎన్నడూ చూడని పరిస్థితి కనిపిస్తోంది.

 

ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావడంతో ప్రధాన రోడ్లన్నీ జనసంచారం లేక బోసిపోయాయి. బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. కొన్ని నెమళ్లు రోడ్డుపైకి వచ్చి ఆహారం తీసుకుంటూ కనువిందు చేశాయి. వాహనాల రొద లేకపోవడం, జనసమ్మర్ధం లేక పోవడంత ఎంతో స్వేచ్చగా నెమళ్లు వచ్చి సందడి చేశాయి.  ఐదు గంటలు కాగానే యావత్ భారత దేశ వ్యాప్తంగా చప్పట్లు మారు మోగాయి.  అప్పటి వరకు ఇంటికే పరిమితం అయిన వారు.. ఒక్కసారే తమ ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లతో వైద్యుల సేవలకు హర్షం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: