మన దేశంలో రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. కొన్ని ప్రాంతాలలో అతివృష్టి వల్ల రైతులు నష్టపోతుంటే మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి వల్ల నష్టపోతున్నారు. యువత వ్యవసాయంపై ఆసక్తి చూపట్లేదు. రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తున్నా వాటికి గిట్టుబాట ధర లభించట్లేదు. కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టాలు వచ్చి కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 
 
అయితే వ్యవసాయంతో కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చని... కొన్ని మెలుకువలు తెలిస్తే వ్యవసాయం లాభసాటి అని ఐటీ ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తున్న ఒక వ్యక్తి చెబుతున్నాడు. లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ ఉద్యోగం వదిలిపెట్టి ఆర్గానిక్ ఫామింగ్ ద్వారా లక్షలు సంపాదిస్తూ ఇతర రైతులకు కూడా ఆర్గానిక్ ఫామింగ్ మెలుకువలు నేర్పిస్తున్నాడు. 
 
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఐటీ ఉద్యోగిగా లక్షల్లో జీతం అందుకున్న సురేష్ దవాంగ్ వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగాన్ని విడిచి సొంత రాష్ట్రమైన కర్ణాటకకు వచ్చాడు. ఆ తరువాత పుర అనే చిన్న గ్రామంలో ఆరు ఎకరాల పొలం కొని ఆర్గానిక్ ఫామింగ్ మొదలుపెట్టాడు. సరైన నీటి సదుపాయం లేక ఇబ్బందులు రావడంతో ప్రత్యేక పద్ధతుల ద్వారా భూగర్భ జలాలను పెంచి ఏటా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. 
 
సురేష్ తన పొలంలో అరటి, నిమ్మ, కొబ్బరి చెట్లను పెంచడంతో పాటు వాటి మధ్య ఉండే ఖాళీ స్థలంలో కూరగాయలు పండిస్తున్నాడు. కేవలం సేంద్రీయ ఎరువులు మాత్రమే వినియోగించి ఏటా సురేష్ 6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కొన్ని మెలుకువలు పాటించి వ్యవసాయం ఎంతో లాభసాటి అని నిరూపిస్తున్నాడు. తోటి రైతులకు ఆర్గానిక్ ఫామింగ్ నేర్పించి ఇతరులకు సురేష్ ఆదర్శంగా నిలుస్తున్నాడు.                     

మరింత సమాచారం తెలుసుకోండి: